breaking news
Hartford
-
US : ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అమెరికా దేశంలోని న్యూయార్క్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనూహ్యంగా మృతి చెందారు. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేష్(22), ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేశ్(21)గా వారిని గుర్తించారు. ఈ విషయాన్ని దినేష్ దగ్గరి స్నేహితులు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిద్దరు ఎలా చనిపోయారన్న దానిపై అక్కడి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దినేష్ 2023 డిసెంబర్ 28న ఉన్నత చదువుల కోసం అమెరికాలోని హార్ట్ఫోర్డ్ చేరాడు. ఇటీవల నికేష్ అక్కడికి చేరుకున్నాడు. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారిద్దరు అమెరికాలో రూమ్మేట్స్ అయ్యారు. అనుకోకుండా ఇద్దరు ఒకే రూమ్‌లో చనిపోయారు. అయితే వీరు ఉంటున్న గదిలో హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వెలువడిందని, దీని కారణంగానే చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, కచ్చితమైన ఆధారాలను బట్టి త్వరలోనే ఒక ప్రకటన చేస్తామన్నారు అధికారులు. వనపర్తిలో విషాద చాయలు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గట్టు వెంకన్నకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు పేరు దినేష్. దినేష్ గత ఏడాది చెన్నైలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టా పొందాడు. డిసెంబర్ 2023 చివర్లో MS చేయడానికి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని హార్ట్ఫోర్డ్ సిటీలో సేక్ర్డ్ హార్ట్ యూనివర్సిటీలో ఆడ్మిషన్ తీసుకుని స్థానికంగా నివాసముంటున్నాడు. దినేష్‌తో పాటు శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ ఉంటున్నాడు. వీరిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్టు తల్లితండ్రులకు సమాచారం అందింది. రూం హీటర్ నుంచి విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ బయటకు వచ్చిందని, దానిని పీల్చడం వల్ల దినేష్, నికేశ్ మరణించినట్టు తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.దీంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే దినేష్ తండ్రి వెంకన్న అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. తన కొడుకు పైచదువుల కోసం అమెరికా వెళుతున్న సందర్భంలో కొడుకుతో అయ్యప్ప స్వామి పూజ చేయించి పంపించారు వెంకన్న. ఇంతలోనే మరణవార్త తెలియడంతో వెంకన్న దంపతులు తల్లడిల్లిపోయారు. (ఎడమ నుంచి మూడో వ్యక్తి, ఎరుపు రంగు దుస్తుల్లో దినేష్) దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం కోరినట్లు దినేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. నికేశ్ కుటుంబ సభ్యులతో తమకు పరిచయం లేదని, వారిద్దరూ ఇటీవలే అమెరికాలో స్నేహితులయ్యారని పేర్కొన్నారు. దినేష్ కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించారు. నికేశ్ కుటుంబం గురించి తెలుసుకుంటున్నట్టు శ్రీకాకుళం పోలీసు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలరాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి సాయానికి రెడీ అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి పట్ల ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు శ్రీకాకుళంకు చెందిన నికేశ్ (21), వనపర్తికి చెందిన దినేష్ (22)గా గుర్తించారని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని రత్నాకర్ అన్నారు. శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ భౌతిక కాయాన్ని పార్థివదేహాన్ని భారత్ కు రప్పించేలా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రయత్నిస్తోందని, మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని రత్నాకర్ తెలిపారు. My deepest condolences to the family of Nikesh from srikakulam AP , who lost his life along with another student dinesh from telnagana at an unfortunate incident. ANDHRA PRADESH CMO is concerned and extended their help. — Kadapa Rathnakar (@KadapaRathnakar) January 15, 2024 ఇదీ చదవండి: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు -
ఆఫీసు అద్దె కట్టని ట్విట్టర్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వెళ్లినప్పటి నుంచీ ట్విట్టర్‌ను వరుసబెట్టి కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న కార్యాలయానికి 1,36,250 డాలర్ల అద్దె చెల్లించడంలో విఫలమవడంతో పరిస్థితి విషయం కోర్టు కేసు దాకా వెళ్లింది! హార్ట్ఫోర్డ్ బిల్డింగ్‌లో 30వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి బకాయి ఉన్న అద్దెను ఐదు రోజుల్లోగా చెల్లించాలంటూ గత డిసెంబర్ 16న యాజమాన్య సంస్థ కొలంబియా రీట్ తాఖీదులిచ్చింది. గడువులోగా చెల్లించకపోవడంతో గురువారం ట్విట్టర్‌పై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది! ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కార్యాలయానికి ట్విట్టర్ కొద్ది కాలంగా అద్దె చెల్లించడం లేదంటూ న్యూయార్క్ టైమ్స్ డిసెంబర్ 13వ తేదీనే కథనం ప్రచురించింది. రెండు చార్టర్ విమానాల అద్దె చెల్లించేందుకు తిరస్కరించినందుకు డిసెంబర్లో కూడా ట్విట్టర్‌పై కేసు నమోదైంది. -
'హోదా' భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు..
-
'హోదా' భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు..
హార్ట్ఫోర్డ్ : ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు దండుకున్నారని అమెరికాలోని కనెక్టికట్ స్టేట్ ఎన్ఆర్ఐలు మండిపడ్డారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీలు గుప్పించారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ చాలు అంటూ మాట మారుస్తున్నారని..ఇది సిగ్గుమాలిన చర్య అని ఎన్ఆర్ఐలు ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదా పోరాటానికి ఎన్ఆర్ఐల సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మోదీ, చంద్రబాబునాయుడు మాట మార్చినందుకుగానూ హార్ట్పోర్డ్లోని ఎన్ఆర్ఐలు ఫ్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, జితేందర్, హరిపెరుగు, శ్రినిను వాసిరెడ్డిలతోపాటూ మరికొందరు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. 'ప్రత్యేక హోదా భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు'.. 'ప్రత్యేక హోదా రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?..' అంటూ ప్రత్యేక హోదాకు మద్దతుగా ఎన్ఆర్ఐలు నినదించారు.