US : ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

US : ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి

Published Tue, Jan 16 2024 9:21 AM

2 Indian Students Found Dead In US - Sakshi

హైదరాబాద్: అమెరికా దేశంలోని న్యూయార్క్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనూహ్యంగా మృతి చెందారు. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేష్‌(22), ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాకు  చెందిన నికేశ్‌(21)గా వారిని గుర్తించారు. ఈ విషయాన్ని దినేష్ దగ్గరి స్నేహితులు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిద్దరు ఎలా చనిపోయారన్న దానిపై అక్కడి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

దినేష్ 2023 డిసెంబర్ 28న ఉన్నత చదువుల కోసం అమెరికాలోని హార్ట్‌ఫోర్డ్‌ చేరాడు. ఇటీవల నికేష్ అక్కడికి చేరుకున్నాడు. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారిద్దరు అమెరికాలో రూమ్‌మేట్స్‌ అయ్యారు. అనుకోకుండా ఇద్దరు ఒకే రూమ్‌లో చనిపోయారు. అయితే వీరు ఉంటున్న గదిలో హీటర్‌ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వెలువడిందని, దీని కారణంగానే చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, కచ్చితమైన ఆధారాలను బట్టి త్వరలోనే ఒక ప్రకటన చేస్తామన్నారు అధికారులు.

వనపర్తిలో విషాద చాయలు

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గట్టు వెంకన్నకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు పేరు దినేష్. దినేష్ గత ఏడాది చెన్నైలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టా పొందాడు. డిసెంబర్‌ 2023 చివర్లో MS చేయడానికి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రంలోని  హార్ట్‌ఫోర్డ్‌ సిటీలో సేక్ర్‌డ్‌ హార్ట్‌ యూనివర్సిటీలో ఆడ్మిషన్‌ తీసుకుని స్థానికంగా నివాసముంటున్నాడు. దినేష్‌తో పాటు శ్రీకాకుళం విద్యార్థి నికేశ్‌ ఉంటున్నాడు. వీరిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్టు తల్లితండ్రులకు సమాచారం అందింది. రూం హీటర్‌ నుంచి  విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ బయటకు వచ్చిందని, దానిని పీల్చడం వల్ల దినేష్, నికేశ్‌ మరణించినట్టు తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.దీంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే దినేష్ తండ్రి వెంకన్న అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. తన కొడుకు పైచదువుల కోసం అమెరికా వెళుతున్న సందర్భంలో కొడుకుతో అయ్యప్ప స్వామి పూజ చేయించి పంపించారు వెంకన్న. ఇంతలోనే మరణవార్త తెలియడంతో వెంకన్న దంపతులు తల్లడిల్లిపోయారు.


(ఎడమ నుంచి మూడో వ్యక్తి, ఎరుపు రంగు దుస్తుల్లో దినేష్‌)

దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం కోరినట్లు దినేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. నికేశ్‌ కుటుంబ సభ్యులతో తమకు పరిచయం లేదని, వారిద్దరూ ఇటీవలే అమెరికాలో స్నేహితులయ్యారని పేర్కొన్నారు. దినేష్  కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించారు. నికేశ్‌ కుటుంబం గురించి తెలుసుకుంటున్నట్టు శ్రీకాకుళం పోలీసు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలరాజు తెలిపారు.  

ఏపీ ప్రభుత్వం నుంచి సాయానికి రెడీ

అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి పట్ల ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు శ్రీకాకుళంకు చెందిన నికేశ్ (21), వనపర్తికి చెందిన దినేష్ (22)గా గుర్తించారని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని రత్నాకర్ అన్నారు. శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ భౌతిక కాయాన్ని పార్థివదేహాన్ని భారత్ కు రప్పించేలా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రయత్నిస్తోందని, మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని రత్నాకర్ తెలిపారు.

ఇదీ చదవండి: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement