
ప్రతికూలతల నుంచి రక్షణ హెచ్–1బి ప్రభావాన్ని పరిశీలించాల్సిందే
కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల అజెండా వాణిజ్య పరమైన అవాంతరాల కారణంగా ఏర్పడే ప్రతికూలతల నుంచి రక్షణనిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఆటుపోట్లు, షాక్‌ల పట్ల అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపింది. కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు అనంతరం చేపట్టిన మూడో సంస్కరణ జీఎస్‌టీ శ్లాబుల క్రమబదీ్ధకరణగా పేర్కొంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని, దేశ వృద్ధి అవకాశాలు మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.
బలమైన వృద్ధి రేటు, స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వం, ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలతో భారత సావరీన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడు రేటింగ్ ఏజెన్సీలు అప్‌గ్రేడ్ చేయడాన్ని ప్రస్తావించింది. ఇటీవల హెచ్1–బి వీసాలపై అమెరికా విధించిన లక్ష డాలర్ల ఫీజును ప్రస్తావిస్తూ.. భవిష్యత్తు రెమిటెన్స్‌లు (స్వదేశానికి నిధుల బదిలీ), వాణిజ్య మిగులుపై దీని ప్రభావం ఏ మేరకో పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు ప్రభావితం కాని సేవల రంగాన్ని సైతం వాణిజ్య అనిశ్చితులు ప్రభావితం చేస్తాయనడానికి హెచ్–1బి వీసాపై విధించిన ఫీజును నిదర్శనంగా పేర్కొంది. ఇప్పటికైతే ఈ రిస్‌్కలను ఎదుర్కోగలమన్న దృక్పథంతో ఉన్నట్టు
తెలిపింది.
టారిఫ్ అనిశ్చితులతో ఉపాధికి రిస్క్
వృద్ధి వేగాన్ని కొనసాగించేందుకు నియంత్రణపరమైన సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధి అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్రాలు సైతం తమ పరిధిలో నియంత్రణలను తొలగించినట్టయితే దేశ ఆర్థిక వ్యవస్థను అధిక వృద్ధి పథంలో నడిపించొచ్చని అభిప్రాయపడింది. ‘‘టారిఫ్ పరమైన అనిశ్చితులు కొనసాగితే, ఎగుమతుల రంగాలపై ప్రభావం పడుతుంది. అది దేశీ ఉపాధి అవకాశాలను, ఆదాయం, వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. కొత్త మార్కెట్లకు మనకు తగిన అవకాశాలు కలి్పంచేందుకు, ఎగుమతుల వృద్ధికి కొంత సమయం పడుతుంది’’అని వివరించింది.