నకిలీ మందులకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం! | Govt Mandates QR Codes For Vaccines Antimicrobials Cancer Drugs To Curb Counterfeit Medicines, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

నకిలీ మందులకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం!

Jun 25 2026 8:43 PM | Updated on Jun 26 2026 1:43 PM

Govt Mandates QR Codes for Vaccines Antimicrobials Cancer Drugs to Curb Counterfeit Medicines

భారతదేశంలో ఔషధాల భద్రత, నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఔషధ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చే లక్ష్యంతో వ్యాక్సిన్లు, యాంటీమైక్రోబియల్ మందులు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, అలాగే మత్తు పదార్థాలకు సంబంధించిన మందులపై QR కోడ్ లేదా బార్‌కోడ్‌ను తప్పనిసరి చేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) ఈ మేరకు డ్రగ్ రూల్స్ 1945 నిబంధనల్లో సవరణలు చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం.. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985 పరిధిలోకి వచ్చే అన్ని వ్యాక్సిన్‌లు, యాంటీమైక్రోబియల్స్, క్యాన్సర్ నిరోధక మందులు, నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ వాటి ప్యాకేజింగ్‌పై బార్‌కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ఈ క్యూఆర్ కోడ్‌లో ఔషధానికి సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది. అందులో మందు పేరు, బ్రాండ్ పేరు, తయారీ సంస్థ వివరాలు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీ లైసెన్స్ నంబర్ వంటి వివరాలు నమోదవుతాయి. వినియోగదారులు లేదా అధికారులు ఈ కోడ్‌ను స్కాన్ చేసి మందు అసలుదా కాదా అనే విషయాన్ని సులభంగా ధృవీకరించవచ్చు.

ఇప్పటివరకు ఈ క్యూఆర్ కోడ్ విధానం దేశంలోని టాప్ 300 ఔషధ బ్రాండ్లకు మాత్రమే వర్తించేది. అయితే తాజా సవరణలతో ఈ వ్యవస్థను మరింత విస్తరించి, అత్యంత కీలకమైన ఔషధ విభాగాలన్నింటికీ వర్తింపజేస్తున్నారు. దీనివల్ల మందుల తయారీ నుంచి వినియోగదారుల చేతికి చేరే వరకు ప్రతి దశను సులభంగా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఛార్జీలు!

ఈ నిర్ణయం ద్వారా నకిలీ మందుల విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయగలదని భావిస్తోంది. ముఖ్యంగా యాంటీమైక్రోబియల్ మందుల విషయంలో నకిలీ లేదా నాసిరకం ఉత్పత్తులను గుర్తించడం సులభమవుతుంది. తద్వారా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఈ నిబంధనలను అమలు చేయడానికి ఔషధ కంపెనీలకు తగిన సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ ఔషధాలపై క్యూఆర్ కోడ్ నిబంధన 2027 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. యాంటీమైక్రోబియల్ మందులపై ఈ నిబంధన 2028 జూలై 1 నుంచి అమలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement