
ఆరేళ్లలో రూ. 2.5 లక్షల కోట్ల లాభం
స్విగ్గీ, జొమాటోకు రూ. 24,000 కోట్ల నష్టాలు
హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీల విలువతో సమానం
పెట్రోలియం, సహజవాయు మంత్రి హర్‌దీప్ సింగ్ పురి
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాల(ఓఎంసీలు) షేర్ల విలువలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మార్కెట్లో వీటికి ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న విలువపట్ల ప్రభుత్వం నిరాశకు లోనైనట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్(ఐవోసీ), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ఉమ్మడిగా గత ఆరేళ్లలో రూ. 2.5 లక్షల కోట్ల నికర లాభం ఆర్జించినట్లు తెలియజేశారు.
అయితే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ స్విగ్గీ, జొమాటో సంయుక్తంగా రూ. 24,000 కోట్ల నష్టాలు ప్రకటించినట్లు ప్రస్తావించారు. అయితే మూడు ఓఎంసీల విలువతో ఈ రెండు కంపెనీల విలువ అటూఇటుగా సమానంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. గతేడాది మూడు ఓఎంసీలు ఉమ్మడిగా ఆర్జించిన లాభాలు దేశీ కార్పొరేట్ లాభాల్లో 3.3 శాతం వాటాకు సమానమని పేర్కొన్నారు. అయితే వీటి విలువ 1 శాతానికంటే తక్కువేనని వెల్లడించారు. వెరసి చమురు మార్కెటింగ్ పీఎస్‌యూ షేర్లకు తగిన విలువ లభించడంలేదని అభిప్రాయపడ్డారు.
వాటా విక్రయ యోచన
ఇంధన విక్రయ దిగ్గజాలలో ప్రభుత్వం కొంతమేర వాటా విక్రయించేందుకు చూస్తున్నట్లు పురి తెలియజేశారు. అయితే వీటిలో పూర్తి వాటాను అమ్మివేసే యోచనలేదని స్పష్టం చేశారు. కంపెనీల సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశలో స్వల్ప వాటాను విక్రయించనున్నట్లు తెలియజేశారు. అయితే బీపీసీఎల్ ఈ జాబితాలో లేనట్లు స్పష్టం చేశారు.