అదానీ గ్రూపు సంస్థల షేర్లు మెరుపులు మెరిపించాయి. ఒక్కరోజులో దాదాపు రూ.40వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను పెంచుకున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ నాయకత్వంలోని కీలక గ్రూప్ కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు మదుపరుల ఉత్సాహాన్ని పెంచాయి. పునరుత్పాదక, ఇంధన రంగాల ఫ్లాగ్‌షిప్ సంస్థల ప్రదర్శనతో ప్రేరణ పొందిన ఈ ర్యాలీ, గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల్లో విస్తృత స్థాయి పెరుగుదలకు దారి తీసింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఒక్కరోజులో రూ.14,521 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదలకను సాధించింది. బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 14% పెరిగి రూ.1,145 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి, రూ.1,113.05 వద్ద ముగిశాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 111% పెరిగి రూ.583 కోట్లకు చేరుకోగా, మొత్తం ఆదాయం 4% తగ్గి రూ.3,249 కోట్లుగా నమోదైంది.
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్‌తో జాయింట్ వెంచర్) షేర్లు 8.7% పెరిగి రూ.675 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి, రూ.634.50 వద్ద ముగిశాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.1,468 కోట్ల మేర పెరిగింది. ఇక ఈ కంపెనీ త్రైమాసిక నికర లాభం ఏడాది ప్రాతిపదికన 9% తగ్గినప్పటికీ, ఇన్‌పుట్ గ్యాస్ ఖర్చులు 26% పెరగడం వల్ల వచ్చిన ఒత్తిడిని మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదు.
పునరుత్పాదక, గ్యాస్ వ్యాపారాల బాటలోనే ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు కూడా ర్యాలీలో భాగమయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 2% పెరిగి, మార్కెట్ విలువలో రూ.5,592 కోట్లు జోడించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ స్టాక్ 3 శాతం పెరగడంతో రూ.8,500 కోట్ల విలువ జతకలిసింది.అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 5% పెరిగి రూ.5,592 కోట్ల విలువను చేర్చుకుంది.
ఇక అంబుజా సిమెంట్స్ రూ.4,041 కోట్లు, ఏసీసీ లిమిటెడ్ రూ.261 కోట్లు, అదానీ విల్మార్ రూ.936 కోట్లు, ఎన్‌డీటీవీ రూ.33 కోట్లు, సంఘి ఇండస్ట్రీస్ రూ.32 కోట్లు మార్కెట్ విలువ పెరుగుదల నమోదు చేశాయి. మొత్తం మీద, బుధవారం ఒక్క రోజులో అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.39,640 కోట్ల మేర పెరిగింది.


