2025–26 ద్వితీయార్థంలో మెరుగు
విద్యుత్ రంగంలోని యుటిలిటీస్ షేర్లు ప్రస్తుతం పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత 12 నెలల్లో విద్యుత్ రంగ కౌంటర్లు అమ్మకాలతో బలహీనపడటమే దీనికి కారణమని ప్రస్తావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో అంతంత మాత్ర ఫలితాలు ప్రకటించిన పలు విద్యుత్ రంగ కంపెనీలు ఈ ఏడాది(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లోనూ నిరుత్సాహకర పనితీరు చూపడం ప్రభావం చూపినట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం(2025 అక్టోబర్–మార్చి 2026)లో విద్యుత్ డిమాండ్ పుంజుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన విద్యుత్ రంగ షేర్లు బలపడే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. దీర్ఘకాలిక ట్రెండ్ ఎలాఉన్నప్పటికీ బొగ్గు ఆధారిత విద్యుత్(థర్మల్) ప్లాంట్ల సామర్థ్య పెంపు ప్రణాళికలకు తెరలేవనుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక డిమాండుకు అనుగునంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్(బీఈఎస్‌ఎస్), పంప్‌డ్ స్టోరేజీ ప్లాంట్లు(పీఎస్‌పీ) పుంజుకోనున్నాయి.
మరోపక్క పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సైతం జత కలవనుంది. అయితే బీఈఎస్‌ఎస్‌తోపాటు.. సోలార్‌కు విదేశీ పరికరాలపై ఆధారపడవలసి ఉంటుంది. దీంతో రాజకీయ భౌగోళిక, సరఫరా చైన్ రిసు్కలు పెరగనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ అధిక వర్షపాతం కారణంగా డిమాండ్ మందగించింది. దీర్ఘకాలిక డిమాండ్ పటిష్టంగా కనిపిస్తోంది. ప్రణాళికలుసహా, వివిధ దశలలో ఉన్న ప్రాజెక్టులరీత్యా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2025–35 మధ్య కాలంలో 86 గిగావాట్లమేర జత కలవనుంది. 68 గిగావాట్ల తొలి అంచనాలకంటే ఇది అధికంకాగా.. వీటికి అనుగుణంగా కనీసం 26 గిగావాట్లమేర పరికరాలకు ఆర్డర్లు ఇవ్వవలసి ఉంటుంది. బీఈఎస్‌ఎస్ సామర్థ్య విస్తరణకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకాలు, జాతీయ స్థాయిలో ప్రసార చార్జీల రద్దు దన్నుగా నిలవనున్నాయి. ఇక 2032కల్లా 32 గిగావాట్ల పీఎస్‌పీ సామర్థ్య లక్ష్యాలలో ఎలాంటి మార్పులేదు. అయితే వీటిలో చాల ప్రాజెక్టులు ఎగ్జిక్యూషన్ దశకు చేరుకున్నాయి.
షేర్లకు జోష్
ఈ ఏడాది ద్వితీయార్థంలో విద్యుత్‌కు డిమాండ్ పెరగడం ద్వారా ఈ రంగంలో దెబ్బతిన్న కౌంటర్లకు జోష్ లభించనుంది. పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌టీపీసీ త్వరలో 6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుకు తెరతీయనుంది. మర్చంట్ పవర్ ఆధారిత జేఎస్‌డబ్ల్యూ, టాటా పవర్‌కంటే రెగ్యులేటెడ్ యుటిలిటీ సంస్థలు ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, సీఈఎస్‌సీ మెరుగైన పనితీరు చూపనున్నాయి. భారీ జలవిద్యుత్(హైడ్రో) ప్రాజెక్టులతో ఎన్‌హెచ్‌పీసీ ఏడాదికి నిలకడగా 20 శాతానికిమించిన వృద్ధిని అందుకోనున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ప్రారంభంకానున్న సోలార్ మాడ్యూల్ ప్లాంట్ ద్వారా సీఈఎస్‌సీ సోలార్ మాడ్యూల్స్, సెల్స్ తయారీలోకి ప్రవేశించనుంది. మర్చంట్ పవర్ మార్కెట్ బలహీనపడటంతో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఫలితాలు నీరసించవచ్చు. వరదల కారణంగా ఎన్‌హెచ్‌పీసీపట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవచ్చు. మరోవైపు భారీ హైడ్రో ప్రాజెక్టులు ఆలస్యంకావడం, కొత్తగా ఏర్పాటు చేస్తున్న థర్మల్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు కోసం ఒప్పందం కుదుర్చుకోకపోవడం ఎస్‌జేవీఎన్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు.
వీక్ డిమాండ్
ఈ ఏడాది ఆగస్ట్‌వరకూ డిమాండ్‌లో వృద్ధి 0.6 శాతానికి పరిమితంకావడంతో సెపె్టంబర్‌లో విద్యుదుత్పత్తి 3 శాతానికి మందగించింది. బొగ్గు నిల్వలు ఏడాది క్రితం నమోదైన 14 రోజులతో పోలిస్తే 20 రోజులకు చేరాయి. దీంతో పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా బొగ్గు విక్రయాల పరిమాణం 2025 ఆగస్ట్‌వరకూ 4 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ పవర్ ఇండెక్స్ వార్షికంగా 22 శాతం క్షీణించింది. విద్యుత్ సరఫరాలవైపు చూస్తే జల విద్యుత్‌లో 9 శాతం, సోలార్‌లో 25 శాతం, పవన విద్యుత్‌లో 9 శాతం చొప్పున ఉత్పత్తి జరిగింది. థర్మల్ విద్యుదుత్పత్తి యథాతథంగా నమోదైంది.
496 గిగావాట్లు
2025 ఆగస్ట్‌కల్లా మొత్తం ఇంధన స్థాపిత సామర్థ్యం 496 గిగావాట్లను తాకింది. గత ఏడాది కాలంలోనే 45 గిగావాట్లు జత కలసింది. దీనిలో పునరుత్పాదక సామర్థ్య వాటా 89 శాతంకాగా.. మొత్తం సామర్థ్యంలో 39 శాతానికి ఎగసింది. ఆగస్ట్‌లో కోల్ ఇండియా విక్రయాలు వార్షికంగా 9 శాతం పుంజుకుంది. గత ఆగస్ట్‌లో అమ్మకాలు తక్కువగా నమోదుకావడం దీనికి కారణం.
ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు


