
గూగుల్ భారతదేశంలోని విద్యార్థులకు ప్రోత్సహించేందుకు తన ఏఐ ప్రో ప్లాన్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. రూ.19,500 సబ్‌స్క్రిప్షన్ కలిగిన ఏఐ ప్రో ప్లాన్ ద్వారా గూగుల్ అధునాతన ఏఐ సాధనాలకు అవకాశం కల్పిస్తోంది. దీన్ని విద్యార్థులు హోంవర్క్, రైటింగ్, వీడియో జనరేషన్‌లో సహాయం పొందేందుకు ఉచితంగా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.
ఈ ఆఫర్లో భాగంగా 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ విద్యార్థులు 12 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌ను కాంప్లిమెంటరీ యాక్సెస్‌గా పొందవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో జెమినీ 2.5 ప్రో, వీయో 3 వంటి విస్తృత శ్రేణి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది వీడియో జనరేషన్ ఏఐ మోడల్. జీమెయిల్, డాక్స్, ఇతర గూగుల్ యాప్స్‌లో 2టీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
కళాశాల పాఠ్యాంశాల అధ్యయనం, పరిశోధన, ఉద్యోగ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సృజనాత్మక ఆలోచన.. వంటి విస్తృత శ్రేణి ఉపయోగాల కోసం విద్యార్థులకు మద్దతుగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. గూగుల్ హైలైట్ చేస్తున్న కొన్ని ఏఐ ఆధారిత టూల్స్ కింది విధంగా ఉన్నాయి.
హోంవర్క్ హెల్ప్ & ఎగ్జామ్ ప్రిపరేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 1,500 పేజీల పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు.
స్టడీ సపోర్ట్: అధిక పేజీలున్న(1,500 పేజీల వరకు) పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు. పరీక్ష సన్నద్ధతలో సహాయం తీసుకోవచ్చు. సంక్లిష్టమైన అంశాలను సులువుగా అర్థం చేసుకోవచ్చు.
రైటింగ్ టూల్స్: వ్యాసాలను రాసేందుకు సాయపడుతాయి.
వీడియో జనరేషన్: గూగుల్ వీయో 3 సిస్టమ్ ఉపయోగించి టెక్స్ట్, ఇమేజ్‌లను షార్ట్ వీడియోలుగా మార్చవచ్చు.
జెమిని ఇంటిగ్రేషన్: జీమెయిల్, డాక్స్, షీట్స్, ఇతర యాప్స్‌లో డైరెక్ట్ ఏఐ సపోర్ట్ ఉంటుంది.
క్లౌడ్ స్టోరేజ్: అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, మీడియా ఫైళ్లను నిల్వ చేసేందుకు డ్రైవ్, జీమెయిల్, ఫోటోస్ కలిపి 2 టీబీ స్పేస్ ఇస్తుంది.
ఉచితంగా ఎలా పొందాలి?
కంపెనీ ప్రతిపాదించిన అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థుల స్టేటస్‌ను విజయవంతంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. కేవలం విద్యార్థులకు మాత్రమే ఈ ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో ఉంటుందని గూగుల్ పేర్కొంది. ఈ ఆఫర్ పొందాలంటే విద్యార్థులు తమ స్టేటస్‌ను వెరిఫై చేసుకోవాలి.
వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా..
గూగుల్ వన్ స్టూడెంట్ ఆఫర్ పేజీకి వెళ్లాలి.
కాలేజీ పేరు, విద్యార్థి పూర్తి పేరు, పుట్టిన తేదీ వంటి అవసరమైన వివరాలను నింపాలి.
గుర్తింపు పొందిన సంస్థ నమోదును రుజువు చేయమని కోరితే డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
వెరిఫై చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఏఐ ప్రో ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి.
ఈ ఆఫర్‌ను రిడీమ్ చేసుకోవడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2025.
నిబంధనలు ఇవే..
విద్యార్థికి 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.
భారత నివాసి అయి ఉండాలి.
వ్యక్తిగత గూగుల్ ఖాతాను ఉపయోగించాలి.
కాలేజీ ఈమెయిల్ లేదా నమోదు రుజువును అందించాలి.
థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్ ద్వారా సబ్‌స్రైబ్ చేయకూడదు.
గూగుల్ పేమెంట్స్ ఖాతాకు చెల్లుబాటు అయ్యే చెల్లింపు పద్ధతిని జోడించాలి. (పోస్ట్-ట్రయల్ బిల్లింగ్ ప్రయోజనాల కోసం).
ఇదీ చదవండి: మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..
మొదటి సంవత్సరానికి ఆఫర్ పూర్తిగా ఉచితం అయినప్పటికీ, ప్రామాణిక రేట్ల వద్ద ఆటోమేటిక్ బిల్లింగ్‌ను నివారించడానికి విద్యార్థులు ట్రయల్ ముగిసేలోపు రద్దు చేయాలని గూగుల్ పేర్కొంది. ఉచిత వ్యవధి తర్వాత మాన్యువల్‌గా రద్దు చేయకపోతే సబ్ స్క్రిప్షన్ రిన్యువల్ అవుతుంది.