డబ్బు ఉంటే.. పెట్టుబడి పెట్టడానికి లెక్కలేనన్ని మార్గాలు కనిపిస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వద్దనుకునేవారిలో చాలామంది.. బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఇంతకీ ఇన్వెస్ట్ చేయడానికి బంగారం ఉత్తమమైనదా?, లేక రియల్ ఎస్టేట్ మంచి మార్గమా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం
బంగారంపై పెట్టుబడి సురక్షితమైన మార్గాల్లో ఒకటిగా భావిస్తారు. దీనికి కారణం.. చిన్న మొత్తంలో గోల్డ్ ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు, అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు. దీనికి ప్రత్యేకించి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు.
సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) ద్వారా.. భారత ప్రభుత్వం తరఫున జారీ చేస్తారు. ప్రస్తుతం ఇవి అందుబాటులో లేదు. కానీ ఇందులో పెట్టే పెట్టుబడి భారీ లాభాలను అందిస్తుంది. ఇవి కాకుండా గోల్డ్ ETFలను కొనుగోలు చేయవచ్చు.
బంగారంపై మీరు పెట్టే పెట్టుబడు.. ధరల కదలికపై ఆధారపడి ఉంటుంది. అంటే గోల్డ్ రేటు పెరిగితే లాభాలను పొందుతారు. గోల్డ్ రేటు తగ్గితే.. గోల్డ్ విక్రయించేటప్పుడు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. పసిడిపై పెట్టే పెట్టుబడి నష్టాలను కలిగించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
రియల్ ఎస్టేట్
రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ కారణంగానే కొందరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. భూములు, ఇళ్లు మొదలైనవాటిపై పెట్టే పెట్టుబడి కొన్ని రోజులకు రెట్టింపు లాభాన్ని తీసుకొస్తుంది. అయితే లాభం కోసం కొన్ని రోజులు వేచి చూడాలి.
భూములపై పెట్టుబడిపెట్టే సమయంలో.. వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదా అని చూసుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుంటే.. ఊహకందని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అయితే.. బంగారం అమ్మినట్లు, భూమిని వెంటనే అమ్ముకోలేరు. అమ్ముకోవడానికి కూడా కొంత సమయం వేచి చూడాలి. అప్పుడే మీరు మంచి లాభాలను పొందవచ్చు. దీనికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, జీఎస్టీ, బ్రోకరేజ్ వంటి ఖర్చులు కూడా ఉంటాయి.
ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ బెస్ట్?
నిజానికి బంగారం, రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టె పెట్టుబడి మంచిదే. అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం ఆభరణాల రూపంలో కొనాలా.., బిస్కెట్లు, కడ్డీల రూపంలో కొనుగోలు చేయాలా? అనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలి.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా.. ఎక్కడ కొనుగోలు చేయాలి, వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా? అనే విషయాలతోపాటు.. మీ బడ్జెట్ ఎంత? అనే విషయాలను ముందుగానే బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి. పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఏ రంగంలో అయినా నష్టాలను చవిచూడక తప్పదు. అవసరమైన కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు తీసుకోవాలి.
ఇదీ చదవండి: ఇల్లు కొనడానికి ఈఎంఐ: టెకీ సలహా..


