
ఒకే రోజు రూ.2,200 పెరుగుదల
ఢిల్లీలో కొత్త గరిష్టం 1,16,200
న్యూఢిల్లీ: పండుగల ముందు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు ఏకంగా రూ.2,200 పెరిగి మరో కొత్త జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,16,200కి చేరుకుంది. వెండి సైతం రూ.4,380 ర్యాలీ చేసి కిలోకి రూ.1,36,380 స్థాయిని (కొత్త ఆల్‌టైమ్ గరిష్టం) తాకింది. ‘అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న బుల్లిష్ ధోరణికి అనుగుణంగా దేశీయంగానూ బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిల్లో ట్రేడయ్యాయి.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు రేట్ల కోతలు ఉంటాయంటూ సంకేతం ఇవ్వడం డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటాన్ని అడ్డుకుంది. ఇది పసిడి, వెండి ధరలకు మద్దతిచి్చంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే బంగారం ధర 50 డాలర్లకు పైగా పెరిగి 3,760 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. ఈ ఏడాది ఇప్పటి దాకా దేశీ మార్కెట్లో పసిడి ధరలు 47%, వెండి ధరలు 52% పెరగడం గమనార్హం.
అక్టోబర్ 21న మూరత్ ట్రేడింగ్
ముంబై: దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు అక్టోబర్ 21న గంట పాటు ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ నిర్వహించనున్నాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు మొదలై 2.45 గంటలకు ట్రేడింగ్ ము గుస్తుందని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ తెలిపాయి. ఈ దీపావళి నుంచి సంవత్ 2082 ఆరంభం కానుంది. ఈ పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాలు వరిస్తాయనే నమ్మకంతో చాలా మంది మూరత్ ట్రేడింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. గతేడాది(2024) ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించాయి.