
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొందరికి భవిష్యత్తుపై ఆశావహాన్ని పెంచితే ఇంకొందరి కొలువులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా ఏఐ వల్ల వివిధ పరిశ్రమల్లోకి వైట్ కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఫైనాన్స్, లా, హెల్త్ కేర్, టెక్నాలజీ వంటి పరిశ్రమల్లో వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించే అవకాశం ఉందని టెక్ లీడర్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాలోని వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం కృత్రిమ మేధతో భర్తీ అవతాయని ఫోర్డ్ మోటార్ సీఈఓ జిమ్ ఫార్లే తెలిపారు.
ఆస్పెన్ ఐడియాస్ ఫెస్టివల్ కార్యక్రమంలో రచయిత వాల్టర్ ఐజాక్‌సన్‌తో ఫార్లే మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ అమెరికాలోని వైట్ కాలర్ కార్మికుల్లో సగం మందిని భర్తీ చేయబోతోంది. భవిష్యత్తులో కృత్రిమ మేధ కేవలం ఉత్పాదకతను పెంపొందించే సాధనంగా మాత్రమే ఉండబోదు. పరిపాలనా, నిర్వహణ, సాంకేతిక ఉద్యోగాల్లో సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది’ అన్నారు.
ఇదీ చదవండి: లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!
అంతకుముందు మే నెలలో జేపీ మోర్గాన్ ఛేజ్‌లో కన్జ్యూమర్ అండ్ కమ్యూనిటీ బ్యాంకింగ్ విభాగం అధిపతి మరియానే లేక్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. ఏఐ ఇంటిగ్రేషన్ కారణంగా కార్యకలాపాల హెడ్ కౌంట్‌ను 10 శాతం తగ్గించాలని బ్యాంక్ భావిస్తోందని చెప్పారు. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ కూడా భవిష్యత్తులో కార్పొరేట్ శ్రామిక శక్తి తగ్గిపోతుందని అంచనా వేశారు.