
పట్టణాల కంటే రెట్టింపు వృద్ధి
జూన్ త్రైమాసికంలో 8.4 శాతం
నీల్సన్‌ఐక్యూ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో మెరుగ్గా ఉన్నట్టు డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్‌ఐక్యూ వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు 4.6 శాతం పెరగ్గా.. దీనికి రెట్టింపు స్థాయిలో 8.4 శాతం మేర గ్రామీణ మార్కెట్లలో వృద్ధి నమోదైనట్టు తన తాజా నివేదికలో తెలిపింది. వరుసగా ఆరో త్రైమాసికంలో అమ్మకాల వృద్ధి (పరిణామం పరంగా) పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో అధికంగా ఉన్నట్టు పేర్కొంది.
ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూస్తే మాత్రం జూన్ క్వార్టర్‌లో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య వృద్ధి పరమైన అంతరం తగ్గినట్టు వెల్లడించింది. మొత్తం మీద జూన్ త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ అమ్మకాల్లో (విలువ పరంగా) 13.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. పట్టణాల్లో స్థిరమైన వినియోగానికి తోడు, గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకున్న వినియోగం ఇందుకు మద్దతుగా నిలిచాయి. అమ్మకాల్లో 6%, ధరల పెంపు రూపంలో 7.4% చొప్పున వృద్ధిని సాధించినట్టు, చిన్న ప్యాకెట్లకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు నీల్సన్‌ఐక్యూ నివేదిక తెలిపింది. చిన్న పట్టణాల్లో అమ్మకాలు పుంజుకుంటున్నట్టు పేర్కొంది.