
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 18 ప్రముఖ నగరాలకు సంబంధించి ఇళ్ల ధరల సూచీ (హెచ్‌పీఐ) 3.6 శాతం పెరిగింది. 18 నగరాల్లో ఇళ్ల కొనుగోలు/విక్రయ లావాదేవీల వివరాలను రిస్ట్రేషన్ విభాగాల నుంచి సమీకరించి, ఆర్‌బీఐ ప్రతీ త్రైమాసికానికి సంబంధించి హెచ్‌పీఐని విడుదల చేస్తుంటుంది. 2022–23 మూల సంవత్సరం (బేస్ ఇయర్)గా ఆర్‌బీఐ 2025–26 క్యూ1 హెచ్‌పీఐని ప్రకటించింది. ఇంతకుముందు వరకు 2010–11 బేస్ సంవత్సరంగా ఉంది. ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం.. ఇళ్ల ధరల పెరుగుదల 3.6 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది.
క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పెరుగుదల 7.6 శాతంగా ఉంది. నాగ్‌పూర్, చండీగఢ్, చెన్నై, కోచిలో ధరల వృద్ధి ఎక్కువగా ఉంది. ఇక త్రైమాసికం వారీగా పోల్చి చూస్తే (మార్చి క్వార్టర్ నుంచి) సూచీ 2 శాతం పెరిగింది. హైదరాబాద్, తిరువనంతపురం, పుణె, ఘజియాబాద్, థానే, గౌతమ్ బుద్ధ నగర్, చండీగఢ్, నాగ్‌పూర్‌ను ప్రస్తుత 10 నగరాలకు అదనంగా సూచీలో ఆర్‌బీఐ చేర్చింది. ఇవి కాకుండా ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, కాన్పూర్, కోచి పట్టణాలు ఈ సూచీలో భాగంగా ఉన్నాయి. ఈ నగరాల్లో ధరల తీరు తెన్నులను సూచీ ప్రతిఫలిస్తుంటుంది.