
బేబీ డైపర్లు, టూత్‌పేస్ట్‌లు సైతం
రేట్ల కోతను ప్రకటించిన ఎఫ్‌ఎంసీజీలు
జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయిస్తూ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తులపై కొత్త రేట్లను తగ్గించాయి. షాంపూలు, సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, టూత్‌బ్రష్‌లు, రేజర్లు, బేబీ డైపర్లు తదితర ఉత్పత్తులకు సంబంధించి కొత్త రేట్లను ప్రకటించాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానుండడం తెలిసిందే. దీంతో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ఇమామీ, హెచ్‌యూఎల్ కొత్త ధరలను తమ పోర్టల్‌పై ప్రకటించాయి.
పీఅండ్‌జీ విక్స్ యాక్షన్ 500 అడ్వాన్స్‌డ్ స్ట్రిప్ ధర రూ.5 తగ్గింది. ఇన్‌హేలర్ ధర సైతం ఇదే స్థాయిలో దిగొచ్చింది. వీటిపై 12 శాతం జీఎస్‌టీ 5 శాతానికి తగ్గింది. షాంపూలపై జీఎస్‌టీ 18% నుంచి 5 శాతానికి దిగొచ్చింది. డైపర్లపై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గగా, బేబీ వైప్స్‌పై 18% నుంచి 5 శాతానికి తగ్గింది. దీంతో పీఅండ్‌జీ తన ఉత్పత్తులపై ఇంతే మేర రేట్లు తగ్గించింది.