
పీఎస్‌బీల్లో ఈడీలుగా కూడా చాన్స్
టాప్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ (పీఎస్‌బీ) దిగ్గజం ఎస్‌బీఐలో ఒక ఎండీ పోస్టుతో పాటు ఇతర పీఎస్‌బీల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలాంటి టాప్ హోదాలకు ప్రైవేట్ రంగ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేలా నియామకాలపై క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) మార్గదర్శకాలను సవరించింది. వీటి ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) ఒక మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పోస్టుతో పాటు పీఎస్‌బీల్లో ఈడీ పోస్టులకు ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లో పని చేస్తున్న వారే కాకుండా ప్రైవేట్ రంగానికి చెందిన వారు కూడా పోటీపడొచ్చు.
ఎస్‌బీఐ ఎండీకి సంబంధించి ప్రైవేట్ అభ్యర్ధులకు బ్యాంకు బోర్డు స్థాయిలో కనీసం రెండేళ్లు, 15 ఏళ్ల బ్యాంకింగ్ అనుభవం సహా మొత్తం మీద కనీసం 21 ఏళ్ల అనుభవం ఉండాలి. ఎస్‌బీఐలో నాలుగు ఎండీ పోస్టులు ఉండగా, కొత్త మార్గదర్శకాల ప్రకారం వాటిల్లో ఒకటి ఓపెన్‌గా ఉంటుంది. సాధారణంగా ఎండీ, చైర్మన్ పోస్టులను అంతర్గత సిబ్బందితోనే భర్తీ చేయడం ఆనవాయితీగా ఉంటోంది. ప్రస్తుతం ఎస్‌బీఐ కాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ మొదలైన 11 పీఎస్‌బీలు ఉన్నాయి. అటు పీఎస్‌బీల్లో ఈడీ పోస్టులకు సంబంధించి ప్రైవేట్ అభ్యర్థులకు బ్యాంకు బోర్డు స్థాయి లో మూడేళ్లు సహా బ్యాంకింగ్ రంగంలో 12 ఏళ్లు, మొత్తం మీద కనీసం 18 ఏళ్ల అనుభవం ఉండాలి.
యూనియన్ల నిరసన
ఏసీసీ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నట్లు తొమ్మిది బ్యాంక్ యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) వెల్లడించింది. దీనిపై కేంద్రానికి నిరసన తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల స్వభావాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న దాడిగా దీన్ని అభివర్ణించింది.
ఇదీ చదవండి: రుణమే.. బంగారమాయెనే!