
బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్న తరుణంలో వాటిపై రుణం తీసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అతి తక్కువ వడ్డీకి రుణ సాయం లభిస్తుండడంతో ఎక్కువ మంది పసిడి రుణాలవైపు అడుగులు వేస్తున్నారు. దీంతో సంఘటిత రంగంలో (ఆర్‌బీఐ కింద నమోదైన బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు) బంగారం రుణాల మార్కెట్ 2026 మార్చి నాటికి రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది.
నిజానికి 2027 మార్చి నాటికి సంఘటిత పసిడి రుణాల మార్కెట్ ఈ స్థాయికి చేరుకుంటుందని 2024 సెప్టెంబర్‌లో ఇక్రా అంచనా వేయగా.. ఇప్పుడు ఏడాది ముందుగానే ఇది సాధ్యపడుతుందని పేర్కొంది. 2027 మార్చి నాటికి రూ.18 లక్షల కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది. 2025 మార్చి నాటికి మొత్తం మీద బంగారం రుణాల మార్కెట్ రూ.11.8 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ‘బంగారం ధరలు స్థిరంగా పెరుగుతుండడం వల్లే మా అంచనాను సవరించాల్సి వచ్చింది. ధరలు కొత్త గరిష్టాలకు చేరుకోవడంతో బంగారం రుణాల మార్కెట్ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో బ్యాంకులు తమ ఆధిక్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. వృద్ధిలో ఎన్‌బీఎఫ్‌సీలను వెనక్కి నెట్టేస్తున్నాయి’ అని ఇక్రా తన నివేదికలో పేర్కొంది.
బ్యాంకుల ఆధిపత్యం..
సంఘటిత బంగారం రుణ మార్కెట్లో బ్యాంకులు మరింత బలంగా మారుతున్నాయి. 2025 మార్చి నాటికి తమ వాటాను 82 శాతానికి పెంచుకున్నట్టు ఇక్రా తెలిపింది. 2019–20 నుంచి 24–25 కాలంలో బ్యాంకుల వాటా ఏటా 26% చొప్పున కాంపౌండెడ్‌గా పెరిగినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీల) వాటా ఈ మార్కెట్లో ఏటా 20% వృద్దిని చూసినట్టు తెలిపింది. బ్యాంకుల రుణ పోర్ట్‌ఫోలియోలోనూ కీలక మార్పును ఈ నివేదిక ప్రస్తావించింది. 2025 మార్చి నాటికి రిటైల్/వ్యక్తిగత పసిడి రుణాలు బ్యాంకుల మొత్తం పసిడి రుణాల్లో 18%కి చేరాయని, ఏడాది ముందు ఇవి 11%గానే ఉన్నట్టు తెలిపింది. బంగారంపై తీసుకునే సాగు, ఇతర అవసరాలకు ఉద్దేశించిన రుణాలు 70% నుంచి 63%కి తగ్గినట్టు పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలోని బంగారం రుణ ఆస్తుల విలువ 2025–26లో 30–35 శాతం పెరగొచ్చని ఇక్రా అంచనా వేసింది. బంగారం ధరలు పెరిగిపోవడం, అన్‌సెక్యూర్డ్ రుణాల్లో వృద్ధి తగ్గడాన్ని ప్రస్తావించింది. 2025 జూన్ నాటికి ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలోని బంగారం రుణాల విలువ రూ.2.4 లక్షల కోట్లుగా ఉండొచ్చని తెలిపింది.
వడ్డీ రేట్లు ఇలా..
బంగారం రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న ఆరంభ వడ్డీ రేటు 8 శాతం (వార్షిక)గా ఉంది. వ్యక్తిగత రుణాల్లో ఇంత తక్కువ రేటుకు మరే రుణం కూడా లభించడం లేదు. ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రం బంగారం రుణాలపై 12 శాతం నుంచి వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు బ్యాంకుల్లో బంగారంపై రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఎన్‌బీఎఫ్‌సీలతో పోల్చినప్పుడు బ్యాంకులపై ఎక్కువ మందిలో విశ్వాసం ఉండడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. బంగారం, ఆధార్, పాన్ డాక్యుమెంట్లతో వెళితే అరగంట, గంట–గంటలోపే బ్యాంకుల్లో రుణం మంజూరవుతుంది.
సిల్వర్ రూ.8,500 జంప్
వెండి ధర రాకెట్ వేగాన్ని తలపిస్తోంది. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం కిలోకి రూ.8,500 ఎగసి రూ.1,71,500 స్థాయికి చేరింది. ముఖ్యంగా గత మూడు పనిదినాల్లోనే వెండి కిలోకి రూ.17,500 పెరగడం డిమాండ్‌ను తెలియజేస్తోంది. ప్రధానంగా పెట్టుబడిదారుల నుంచి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు బంగారం ధర (99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాములకు రూ.600 నష్టపోయి రూ.1,26,000 వద్ద స్థిరపడింది. సురక్షిత సాధనాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ధరల పెరుగుదలకు మద్దతుగా నిలుస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్స్‌కు 51 డాలర్లకు చేరుకోగా, స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 17 డాలర్ల మేర పెరిగి 3,993 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.
ఇదీ చదవండి: ఇళ్ల ధరలు ఎంత పెరిగాయంటే..