భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలు | First international showcase for the NMACC India Weekend at New York | Sakshi
Sakshi News home page

భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలు

Jun 10 2025 10:01 AM | Updated on Jun 10 2025 10:29 AM

First international showcase for the NMACC India Weekend at New York

భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసీసీ) ఇండియా వీకెండ్‌ను న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుందని చెప్పారు. ఈమేరకు ‘ఎన్‌ఎంఏసీసీ.ఇండియావికెండ్‌’ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో వివరాలు వెల్లడించారు. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు.. వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ఈ ఉత్సవాలు ‘గ్రాండ్‌ స్వాగత్‌’ పేరుతో సెలబ్రిటీల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. ఈ హైప్రొఫైల్ ఈవెంట్‌లో మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇది భారతదేశం హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుంది. విజువల్ ఫీస్ట్‌కు అనుబంధంగా వికాస్ ఖన్నా తయారు చేసిన స్టార్ మెనూతో వంటకాలు ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’తో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయి. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్‌ చరిత్రకు జీవం పోస్తుందని నీతా చెప్పారు.

ఇదీ చదవండి: అస్థిర ధరలు.. చైనా ఈవీకి సవాళ్లు

అతిథులు బాలీవుడ్ డ్యాన్స్‌ వర్క్‌షాప్‌ల్లో పాల్గొనవచ్చు. గార్బా, దాండియా రాస్‌ను ఆస్వాదించవచ్చు. ‘ది గ్రేట్ ఇండియన్ బజార్’లో భాగంగా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఎస్‌ఎంఏసీసీ ఇండియా వీకెండ్ యూఎస్‌లో నిర్వహించే అతిపెద్ద భారతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఉండనుంది. ‘సంస్కృతి విభిన్న ఆచారవ్యవహారాలున్న మనుషులను కలుపుతుంది. సహానుభూతిని పెంపొందిస్తుంది. 5,000 ఏళ్లకు సంబంధించిన భారతదేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement