దేశీయంగా రూ. 2,200 కోట్లకు రెడీ
ముంబై: కార్డుల తయారీ యూఎస్ కంపెనీ ఫెడరల్ కార్డ్(Federal Card) సర్టీసెస్ దేశీయంగా 25 కోట్ల డాలర్లు(రూ. 2,200 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. పుణేలో మెటల్, బయోడీగ్రేడబుల్ కార్డుల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. టెక్నాలజీ, రియలీ్ట, సర్వీసు రంగాలలో పెట్టుబడులతో ప్రత్యక్షంగా 1,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించింది. పుణే ప్లాంటులో 100 శాతం మెటల్, బయోడీగ్రేడబుల్ కార్డుల తయారీ చేపట్టనున్నట్లు పేర్కొంది. 2026 ఫిబ్రవరికల్లా ప్లాంటును ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది.
తొలి దశలో 32,000 చదరపు అడుగులలో ప్లాంటును నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. వార్షికంగా 20 లక్షల కార్డుల తయారీ సామర్థ్యంతో ప్రారంభంకానున్నట్లు వెల్లడించింది. తదుపరి 26.7 మిలియన్లకు సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు తెలియజేసింది. దేశీ మార్కెట్ పట్ల ఆసక్తిని చూపిస్తున్న కంపెనీ ప్రపంచవ్యాప్త వృద్ధిలో భారత్ కేంద్రంగా నిలవనున్నట్లు వివరించింది. పుణేలో పెట్టుబడులు దేశీయంగా దీర్ఘకాలిక కట్టుబాటుకు ప్రారంభమని పేర్కొంది. తద్వారా అంతర్జాతీయంగా పేమెంట్ సొల్యూషన్లను భారత్ నుంచి సమకూర్చనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్, వీసా, మాస్టర్‌కార్డ్, ఎఫ్‌పీఎల్ టెక్నాలజీస్(వన్‌కార్డ్)తో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.


