పన్ను ఆదా కోసం ఫేక్‌ చేస్తే.. కొత్త రూల్స్‌తో కొరడా | Faked a tax deduction New ITR rules could slap you with 200pc penalty and prosecution | Sakshi
Sakshi News home page

పన్ను ఆదా కోసం ఫేక్‌ చేస్తే.. కొత్త రూల్స్‌తో కొరడా

Jun 2 2025 1:34 PM | Updated on Jun 2 2025 1:48 PM

Faked a tax deduction New ITR rules could slap you with 200pc penalty and prosecution

ప్రస్తుతం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు సీజన్‌ నడుస్తోంది. ఐటీఆర్‌ ఫైలింగ్‌కు గడువు సాధారణంగా జూలై 31 వరకూ ఉండగా ఈసారికి ఆ గడువును సెప్టెంబర్‌ 15కు పెంచింది ప్రభుత్వం. ట్యాక్స్‌ ఫైలింగ్‌ అంటేనే అందరి దృష్టి ట్యాక్స్‌ డిడక్షన్లపైనే ఉంటుంది. అయితే కొంతమంది పన్ను ఆదా కోసం త‍ప్పుడు ట్యాక్స్‌ డిడక్షన్లతో మోసానికి పాల్పడుతున్నారు.

ఆదాయపు పన్ను శాఖ ఇటీవల చేసిన దర్యాప్తులో 90,000 మందికి పైగా వేతన జీవులు తప్పుడు మినహాయింపులు క్లెయిమ్ చేసినట్లు తేలింది. ఇది దేశ పన్ను ఖజానాకు రూ .1,070 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించింది. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఈసారి ఫైలింగ్ ప్రక్రియను కఠినతరం చేసింది. మోసపూరిత పన్ను మినహాయింపులు క్లయిమ్‌ చేయడం ఇప్పుడు అంత సులువు కాదు. నవీకరించిన ఆదాయపు పన్ను రిటర్న్ యుటిలిటీలు  ఐటీఆర్ -1, ఐటీఆర్ -4 ఇప్పుడు ఆదాయపు పన్ను చట్టంలోని కీలక విభాగాలలో మినహాయింపులకు బలమైన రుజువును కోరుతున్నాయి.

ఎల్ఐసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ వంటి పెట్టుబడులను కవర్ చేసే సెక్షన్ 80సీ కింద చేసే క్లెయిమ్‌లలో పాలసీ నంబర్లు లేదా డాక్యుమెంట్ ఐడీలు ఉండాలి. సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా కోసం, పన్ను చెల్లింపుదారులు బీమా కంపెనీ పేరు పాలసీ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. రుణాలపై కోరే మినహాయింపులనూ ప్రభుత్వ కఠినతరం చేసింది. సెక్షన్ 80ఈ, 80ఈఈ, 80ఈఈఏ కింద క్లయిమ్‌ చేసే ఎడ్యుకేషన్, హోమ్ లోన్ బెనిఫిట్స్ కు బ్యాంకుల పేర్లు, లోన్ అకౌంట్ నంబర్లు, మంజూరు తేదీలతో సహా సవివరంగా వెల్లడించాల్సి ఉంటుంది. సెక్షన్ 80ఈఈబీ కింద ఎలక్ట్రిక్ వాహనాల మినహాయింపుల కోసం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను కూడా వెల్లడించాలి.

200 శాతం జరిమానా
ట్యాక్స్‌ ఫైలర్లు చేసిన క్లెయిమ్‌లను క్రాస్ చెక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్) ను ఉపయోగించుకుంటుంది. నకిలీ క్లెయిమ్‌లను అరికట్టడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ద్వారా సమ్మతిని పెంచడం ఈ కఠిన నిబంధనల లక్ష్యం. కాబట్టి పన్ను చెల్లింపుదారులు తాము  చేసే ప్రతి మినహాయింపునకు సరైన డాక్యుమెంటేషన్‌తో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే పన్ను బకాయిపై 200 శాతం జరిమానాను 24 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. సెక్షన్ 276సీ కింద దర్యాప్తును కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement