రియల్‌ ఎస్టేట్‌లోకి మరో బడా కంపెనీ | GMR Airports Real Estate Business Subsidiary Aramex Cargo Logistics | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌లోకి మరో బడా కంపెనీ

Oct 15 2026 9:28 PM | Updated on Oct 15 2026 9:33 PM

GMR Airports Real Estate Business Subsidiary Aramex Cargo Logistics

రియల్‌ ఎస్టేట్‌, స్థలాల అభివృద్ధి, ఇతర అనుబంధ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జీఎంఆర్‌ ఏరో రియల్టీ (జీఏఆర్‌ఎల్‌) పేరిట అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అక్టోబర్‌ 13న ఏర్పాటైన ఈ సంస్థకు రూ.1 కోటి పెయిడప్‌ షేర్‌ క్యాపిటల్‌ ఉంది. రూ.10 ముఖ విలువ కలిగిన 10 లక్షల ఈక్విటీ షేర్లతో సంస్థను ఏర్పాటు చేశారు. అయితే, కొత్త సంస్థ ఇంకా కార్యకలాపాలను ప్రారంభించలేదు. రియల్‌ ఎస్టేట్‌, భూముల అభివృద్ధి, ఇతర సంబంధిత వ్యాపార అవకాశాలను అన్వేషించడం దీని ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.

మరోవైపు, విమానాశ్రయాల ద్వారా సరుకు రవాణా సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌, అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ సంస్థ అరామెక్స్‌ చేతులు కలిపాయి. జీఎంఆర్‌ నిర్వహణలోని విమానాశ్రయాల్లో అరామెక్స్‌ కార్యకలాపాలను బలోపేతం చేయడం, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) అంతర్జాతీయ సరుకు రవాణాకు మద్దతు ఇవ్వడం ఈ ఒప్పందం ఉద్దేశం. ఎక్స్‌ప్రెస్‌ కార్గో టెర్మినళ్ల వద్ద ప్రత్యేక ట్రక్కు డాక్స్‌, సరుకు తనిఖీ వ్యవస్థలు, కార్గో నిర్వహణకు అవసరమైన స్థలాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను ఇరు సంస్థలు పరిశీలించనున్నాయి. టెర్మినల్‌కు సమీపంలో విమానాశ్రయం వైపు నేరుగా చేరుకునే ప్రత్యేక మార్గంతో గిడ్డంగిని ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించనున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనల అమలు తుది ఒప్పందాలు, పెట్టుబడులు, ప్రాజెక్టు కాలపరిమితులపై ఆధారపడి ఉంటుంది.

ఈ వ్యూహాత్మక విస్తరణకు జీఎంఆర్‌ గ్రూప్‌ ఇప్పటికే అభివృద్ధి చేసిన విమానాశ్రయ మౌలిక సదుపాయాలు కీలకంగా మారనున్నాయి. సంస్థ అధికారిక సమాచారం ప్రకారం, 2025–26 ఆర్థిక సంవత్సరంలో జీఎంఆర్‌ విమానాశ్రయాల ద్వారా 1.3 మిలియన్‌ టన్నులకు పైగా సరుకు రవాణా జరిగింది. ఢిల్లీ, హైదరాబాద్‌, గోవా విమానాశ్రయాల్లో కార్గో సదుపాయాలు ఉండటంతో పాటు, హైదరాబాద్‌ కేంద్రం ఔషధాల ఎగుమతులకు ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది. విమానాశ్రయాల చుట్టూ భూముల అభివృద్ధి, గిడ్డంగులు, కార్గో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం ద్వారా విమానయానేతర ఆదాయ మార్గాలను విస్తరించుకునే అవకాశం సంస్థకు లభించవచ్చు. అయితే, కొత్త రియల్టీ అనుబంధ సంస్థ చేపట్టబోయే నిర్దిష్ట ప్రాజెక్టులపై ఇంకా వివరాలు వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement