“మా వాళ్లకే ప్రాధాన్యం”.. నెట్‌ఫ్లిక్స్‌ సంచలన నిర్ణయం | Netflix Plans To Lay Off 1,000 Employees Worldwide Amid Rising Competition From YouTube And TikTok, Check More Details Inside | Sakshi
Sakshi News home page

“మా వాళ్లకే ప్రాధాన్యం”.. నెట్‌ఫ్లిక్స్‌ సంచలన నిర్ణయం

Oct 15 2026 9:03 AM | Updated on Oct 15 2026 9:52 AM

Netflix Mass Layoffs: 1000 Jobs to Go as Streaming Competition Intensifies

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మా వాళ్లకే ప్రాధాన్యం అంటూ సంస్థ నుంచి భారీగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు లేఆఫ్స్‌పై ప్రకటన కూడా చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగుల తొలగింపు ఇది కాగా.. ఆ సంస్థ చరిత్రలో ఇదే పెద్దది కావడం గమనార్హం. 

“ప్రపంచాన్ని వినోదంతో అలరించడమే మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే మా ఉద్యోగులు, వనరులను ఎక్కడ వినియోగించాలనే విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించాలి” అని నెట్‌ఫ్లిక్స్‌ సహ-సీఈవోలు టెడ్‌ సరండోస్‌, గ్రెగ్‌ పీటర్స్‌ ఉద్యోగులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఇక్కడ ‘మా వాళ్లు’ అంటే ఏంటన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. అయితే ఉద్యోగులు, ఇతర వనరులను అవసరమైన విభాగాల్లో వినియోగిస్తూ సంస్థను మరింత సమర్థంగా నడపాలన్నది వారి మాటల ఉద్దేశం అని మాత్రం అర్థమవుతోంది.

100లో 6 అవుట్‌!
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులు పనిచేస్తున్నారు!. వీరిలో దాదాపు వెయ్యి మందిని తొలగించనుంది. అంటే ప్రతి వంద మంది ఉద్యోగుల్లో సుమారు ఆరుగురు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. ఈ కోతల ప్రభావం ప్రధానంగా కంటెంట్‌, సాంకేతికత, న్యాయ సేవలు, మానవ వనరుల విభాగాలపై పడనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే ఈ ప్రక్రియనే ‘మాస్‌ లేఆఫ్స్‌’ అంటారని తెలిసిందే.

యూట్యూబ్‌, టిక్‌టాక్‌తో పోటీలో ఢీలా!
మరి వ్యాపారం బాగుందని చెబుతున్న సంస్థ ఉద్యోగులను ఎందుకు తొలగిస్తోంది? దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రేక్షకుల కోసం పెరుగుతున్న పోటీ. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలంటే సాధారణంగా చందా తీసుకోవాలి. అదే యూట్యూబ్‌, టిక్‌టాక్‌ వంటి వేదికల్లో ఉచితంగా వీడియోలు చూసే అవకాశం ఉంది. దీంతో ప్రేక్షకులు ఏ వేదికపై ఎక్కువ సమయం గడుపుతున్నారు? నెట్‌ఫ్లిక్స్‌ కోసం చెల్లించే డబ్బుకు తగ్గ వినోదం లభిస్తోందా? అనే అంశాలు సంస్థకు కీలకంగా మారాయి.

ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొత్త సినిమాలు, సిరీస్‌లపై ఖర్చు చేయడంతోపాటు.. ప్రకటనలతో కూడిన సబ్‌స్క్రిప్షన్లు, ప్రత్యక్ష ప్రసారాలు, గేమింగ్‌ వంటి కొత్త మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవాలని నెట్‌ఫ్లిక్స్‌ ప్రయత్నిస్తోంది. ఈ పోటీలో ఖర్చులను నియంత్రించుకుంటూ, ఎక్కువ ప్రయోజనం కలిగించే విభాగాలపై దృష్టి పెట్టాలన్నది సంస్థ వ్యూహంగా కనిపిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నా.. దాని పూర్తిస్థాయి ఉద్యోగుల సంఖ్య సుమారు 16 వేలే!. ఎందుకంటే ఇది వేలాది బ్రాంచ్‌లు, సినిమా థియేటర్లు నిర్వహించే సంస్థ కాదు. ఇంటర్నెట్‌ ద్వారా సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తుంది. అందువల్ల ప్రతి దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం ఉండదు. ఇక సినిమాలు, సిరీస్‌ల నిర్మాణంలో పనిచేసే కొందరు తాత్కాలిక సిబ్బంది, కాంట్రాక్టర్లు ఈ పూర్తిస్థాయి ఉద్యోగుల లెక్కకు అదనం.

ఏ ప్రాంతంలో ఎంతమంది?
నెట్‌ఫ్లిక్స్‌ 2025 డిసెంబర్‌ 31 నాటి అధికారిక నివేదిక ప్రకారం.. అమెరికా, కెనడాలో అత్యధికంగా 10,900 మంది ఉద్యోగులు ఉన్నారు. యూరప్‌, మిడిల్‌ఈస్ట్‌, ఆఫ్రికా ప్రాంతాల్లో 2,500 మంది, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 1,900 మంది, లాటిన్‌ అమెరికాలో 700 మంది పనిచేస్తున్నారు. ఈ నాలుగు ప్రాంతాల్లో కలిపి మొత్తం 16 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నారు.

ఇప్పుడు వీరిలో దాదాపు వెయ్యి మందిని తొలగిస్తే.. ప్రతి వంద మంది ఉద్యోగుల్లో ఆరుగురికి పైగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. ఈ కోతల ప్రభావం ప్రధానంగా ప్రొడక్ట్‌, టెక్నాలజీ, న్యాయ సేవలు, మానవ వనరుల విభాగాలపై పడనుంది.

ఉద్యోగుల్లో ఆందోళన
నెట్‌ఫ్లిక్స్‌ వ్యాపారం బలంగా ఉందని, ఈ ఏడాది ఆదాయ లక్ష్యాలను చేరుకుంటామని సహ-సీఈవోలు చెబుతున్నారు. అయినప్పటికీ, భవిష్యత్తులో వృద్ధిని కొనసాగించేందుకు సంస్థలో మార్పులు అవసరమని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే నిర్ణయం తీసుకున్నారు. 2022లో చందాదారులు(సబ్‌స్క్రయిబర్లు) భారీగా తగ్గిన సమయంలోనూ నెట్‌ఫ్లిక్స్‌ వందలాది ఉద్యోగాలను తొలగించింది. రెండు విడతలుగా.. 450 మందిని తొలగించింది. ఇప్పుడు మరోసారి భారీ కోతలకు దిగుతోంది.

ఇదీ చదవండి: ఆ గలీజు రోబోను ఏం చేశారంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement