యువతులతో అనుచిత ప్రవర్తన
స్వాదీనం చేసుకున్న పోలీసులు
ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు
జర్మనీలోని కొలోన్లో ఘటన
కొలోన్: కృత్రిమ మేథను అసాంఘిక కార్యకలాపాలకు కూడా వాడుకోవచ్చనేందుకు ఓ తాజా ఉదాహరణ ఇది. సుమారు 3 అడుగుల 11 అంగుళాల ఎత్తులో ఉన్న ఓ రోబో అబ్బాయి మాదిరిగానే ప్యాంటు, షర్టు, కళ్లకు అద్దాలతో అలా రోడ్డున వెళ్తూ ఓ 16 ఏళ్ల బాలికను అనుచితంగా తాకడంతోపాటు, లైంగిక సంజ్ఞలు చేసింది. దీంతో, బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రోబోను, దానిని నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న ఇద్దరు టీనేజీ యువకుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జర్మనీలోని నార్త్ రైన్ వెస్ట్ఫాలియా రాష్ట్రం కొలోన్ నగరంలో ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద శనివారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. ఓ రోబోతో 16 ఏళ్లు, 19 ఏళ్ల టీనేజీ బాలురు తమ ముందు నడిచి వెళ్తున్న యువతులకు సమీపంలోకి వెళ్లారు. ఆ రోబో 16 ఏళ్ల బాలికను వెనుక నుంచి పట్టుకుని, గట్టిగా తనకేసి అదుపుముకుంది.
మిగతా వారిని గట్టిగా కౌగలించుకుంది. వారికి లైంగిక సంజ్ఞలు చేసింది. ఇదంతా, టీనేజీ బాలురు వీడియో చిత్రీకరిస్తూ, హేళనగా నవ్వుతూ ఉన్నారు. చుట్టుపక్కల వారు కూడా దీనినో వినోదంగానే భావించారు. అయితే, బాధిత మహిళలు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని, ఓ కారు డిక్కీలో ఉన్న రోబోను స్వా«దీనం చేసుకున్నారు. రోబో మూతిపై అతికించిన మీసాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు టీనేజీ బాలుర సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. అప్పటికే ఆ వీడియోను వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా లైకులు, కామెంట్లు కూడా వచ్చినట్లు గుర్తించారు. ఇదో కొత్త రకం నేరమని, ఇలాంటివీ ఉంటాయని తమకు ఇప్పుడే తెలిసిందని కొలోన్ పోలీసు విభాగం ప్రతినిధి క్రిస్టోఫ్ బెర్మెల్ సోమవారం వ్యాఖ్యానించారు. అనుమానితులు ఆ రోబోతో కావాలనే అలా చేయించారా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఇలాంటి ఘటనల వీడియోలను షేర్ చేసినా, హేళనగా వ్యాఖ్యానించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు బాధితులతో మరింతగా వేదనకు గురవుతున్నారన్నారు.


