ఈక్విటీ ఫండ్స్‌ పెట్టుబడుల్లో తగ్గిన జోరు | Equity mutual fund inflows slowed in September 2025 | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఫండ్స్‌ పెట్టుబడుల్లో తగ్గిన జోరు

Oct 11 2025 4:49 AM | Updated on Oct 11 2025 8:00 AM

Equity mutual fund inflows slowed in September 2025

సెప్టెంబర్లో రూ.33,430 కోట్లు రాక 9 శాతం తగ్గుముఖం 

‘సిప్‌’లకు కొనసాగుతున్న ఆదరణ 

గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లోకి భారీ పెట్టుబడులు

న్యూఢిల్లీ: మార్కెట్లలో ఆటుపోట్లు, అంతర్జాతీయ అనిశి్చతుల మధ్య ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల్లో జోరు తగ్గినట్టు కనిపిస్తోంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల రాక వరుసగా రెండో నెలలోనూ తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్‌ నెలలో నికరంగా రూ.30,421 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆగస్ట్‌లో వచ్చిన రూ.33,430 కోట్లతో పోల్చి చూస్తే 9 శాతం తగ్గాయి. 

ఈ ఏడాది జూలైలో వచ్చిన రూ.42,703 కోట్లు నెలవారీ ఆల్‌టైమ్‌ గరిష్ట పెట్టుబడులుగా ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ఈ వివరాలను విడుదల చేసింది. వరుసగా 55వ నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ నికరంగా పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మెరుగైన పనితీరు చూపిస్తాయనే విషయంలో ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు.

 ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక తగ్గడం అన్నది సైక్లికల్‌ తప్ప (తాత్కాలికం) నిర్మాణాత్మకం కాదని మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ నేహల్‌ మెష్రామ్‌ పేర్కొన్నారు. పెట్టుబడులు మోస్తరు స్థాయికి పరిమితం కావడం వెనుక థీమ్యాటిక్‌ ఫండ్స్‌ నిధుల సమీకరణ తగ్గడమే కారణమని శామ్కో మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో విరాజ్‌ గాంధీ తెలిపారు.  

సిప్‌ రూపంలో రూ.29,361 కోట్లు 
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి సెప్టెంబర్‌ నెలలో రూ.29,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లు దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులకు ప్రాధా న్యం ఇస్తున్నట్టు ఇది తెలియజేస్తోంది. ఆగస్ట్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.28,265 కోట్లుగా ఉన్నాయి. సిప్‌ ఖాతాల  సంఖ్య ఆగస్ట్‌ చివరికి ఉన్న 8.99 కోట్ల నుంచి 9.25 కోట్లకు చేరింది. ఒక ఇన్వెస్టర్‌కు ఒకటికి మించిన ఖాతాలు ఉండొచ్చు. ఒక పథకంలో పెట్టుబడిని ఒక ఖాతా (ఫోలియో) కింద పరిగణిస్తారు. సిప్‌ రూపంలోని మొత్తం నిర్వహణ ఆస్తుల విలువ రూ.15.52 లక్ష లకోట్లకు చేరింది.  

విభాగాల వారీగా.. 
→ ఈక్విటీ ఫండ్స్‌ అన్నింటిలోకి ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ అత్యధికంగా రూ.7,029 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ విభాగంలోకి పెట్టుబడులు బలంగా రావడం వరుసగా మూడో నెలలోనూ కనిపించింది. మార్కెట్‌ క్యాప్‌తో సంబంధం లేకుండా మెరుగైన పెట్టుబడుల అవకాశాలు ఎక్కడ ఉన్నా ఫ్లెక్సీక్యాప్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి.  
→ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.5,085 కోట్లు, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.4,363 కోట్ల చొప్పున నికరంగా ఆకర్షించాయి. 
→ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.2,319 కోట్లుగా ఉన్నాయి.  
→ సెక్టోరల్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక రూ.1,220 కోట్లకు పరిమితమైంది.  
→ పన్ను ఆదాకు ఉపకరించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ నుంచి రూ.308 కోట్లు, డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్స్‌ నుంచి రూ.168 కోట్లు చొప్పున బయటకు వెళ్లాయి.  
→ హైబ్రిడ్‌ ఫండ్స్‌ రూ.2,014 కోట్లు, ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ రూ.1,747 కోట్లు, ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ రూ.988 కోట్ల చొప్పున ఆకర్షించాయి.  
→ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి సెప్టెంబర్‌లో రూ.1.02 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఆగస్ట్‌లో డెట్‌ ఫండ్స్‌ నుంచి ఉపసంహరణలు రూ.7,980 కోట్లుగానే ఉన్నాయి. దీంతో పోల్చితే ఉపసంహరణలు గణనీయంగా పెరిగాయి.  
→ మొత్తం మీద మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ సెప్టెంబర్‌ నెలలో రూ.43,146 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.75.61 లక్షల కోట్లకు చేరింది. ఆగస్ట్‌ చివరికి ఇది రూ.75.12 లక్షల కోట్లుగా ఉంది.  

గోల్డ్‌ ఫండ్స్‌కు డిమాండ్‌ 
బంగారం ధరలు ఇటీవలి కాలంలో స్థిరమైన ర్యాలీ చేస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఇందుకు నిదర్శనంగా సెప్టెంబర్‌లో రూ.8,363 కోట్ల పెట్టుబడులు గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లోకి (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు) వచ్చాయి. ఒక నెలలో అత్యధిక పెట్టుబడులు రాక ఇదే. ఆగస్ట్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచి్చన పెట్టుబడులు రూ.2,190 కోట్లుగా ఉన్నాయి. దీంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.90,000 కోట్ల మార్క్‌ను చేరుకుంది.

 ‘‘బంగారం బలమైన ర్యాలీ చేయడం ఈ పెట్టుబడుల ధోరణికి కారణమని ఏంజెల్‌ వన్‌ ఏఎంసీ ఈడీ, సీఈవో హేమెన్‌ భాటియా తెలిపారు. సిల్వర్‌ (వెండి) ఈటీఎఫ్‌లు సైతం మెరిశాయి. ఇటీవలి కాలంలో వెండి ధరలు సైతం భారీగా పెరగడం చూస్తున్నాం. దీంతో సెప్టెంబర్‌లో సిల్వర్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.5,342 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిల్వర్‌ ఈటీఎఫ్‌ నిర్వహణ ఆస్తులు రూ.36,461 కోట్లకు చేరాయి. ఈక్విటీ, డెట్‌తోపాటు బంగారం వెండిలోనూ పెట్టుబడులు పెట్టే – మల్టీ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌లోకి రూ.4,982 కోట్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement