
అమెరికా టారిఫ్‌లు పేటెంట్, బ్రాండెడ్ ఉత్పత్తులకే పరిమితం
నిపుణులు, పరిశ్రమ వర్గాల వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి వంద శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంతో మన కంపెనీలపై తక్షణ ప్రభావం పడే అవకాశమేమీ ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ నిబంధన కేవలం పేటెంట్, బ్రాండెడ్ ఉత్పత్తులకే తప్ప జనరిక్ ఔషధాలకు కాదని వివరించాయి. చౌకైన, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ అంతర్జాతీయంగా ఔషధాల సరఫరా వ్యవస్థకి భారత్ మూలస్తంభంగా నిలుస్తోందని, 47 శాతం అమెరికా ఔషధ అవసరాలను తీరుస్తోందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు.
టారిఫ్‌ల ప్రభావం మన మీద ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ‘మనం చాలా మటుకు జనరిక్స్‌నే అందిస్తున్నందున పేటెంట్, బ్రాండెడ్ ఫార్మా దిగుమతులపై ప్రతిపాదిత 100 శాతం టారిఫ్‌లు భారత ఎగుమతులపై తక్షణ ప్రభావమేమీ చూపకపోవచ్చు. అంతేగాకుండా పలు బడా భారతీయ కంపెనీలు ఇప్పటికే అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తయారీ ప్లాంట్లు లేదా రీప్యాకేజింగ్ యూనిటను నిర్వహించడంతో పాటు ఇతర సంస్థల కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాయి‘ అని నమిత్ జోషి వివరించారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) కూడా మన ఫార్మాపై అమెరికా టారిఫ్‌ల తక్షణ ప్రభావమేమీ ఉండదని తెలిపింది. ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా తదితర 23 దేశీ దిగ్గజాలకు ఐపీఏలో సభ్యత్వం ఉంది. వీటికి ఔషధ ఎగుమతుల్లో దాదాపు 80 శాతం, దేశీ మార్కెట్లో సుమారు 64 శాతం వాటా ఉంది.
కొత్త అవకాశాలపై ఇన్వెస్ట్ చేయాలి ..
రాబోయే రోజుల్లో బల్క్ డ్రగ్స్, ఏపీఐలకు (యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్) సంబంధించిన వ్యయాలను మరింతగా తగ్గించుకుంటే ఇతర సరఫరాదారుల కన్నా భారత్ వైపే అమెరికా మరింతగా మొగ్గు చూపడానికి అవకాశం ఉందని జోషి చెప్పారు. అలాగే సంక్లిష్టమైన జనరిక్స్, పెప్టైడ్స్, బయోసిమిలర్స్ మొదలైన విభాగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికాకు తమ ఎగుమతులు పెద్దగా లేనందున టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండదని ఎమ్‌క్యూర్ ఫార్మా తెలిపింది. భారత ఫార్మా కంపెనీల జనరిక్ ఔషధాల సరఫరాతో 2022లో అమెరికా హెల్త్‌కేర్ వ్యవస్థకు 219 బిలియన్ డాలర్లు, 2013–2022 మధ్య కాలంలో 1.3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆదా అయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో మరో 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అవుతుందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఫార్మెక్సిల్ గణాంకాల ప్రకారం 2024–25లో అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
జనరిక్స్ మన బలం..
భారత్ బలం జనరిక్ ఔషధాలని, వీటికి టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్నందున భారత్‌పై ప్రభావం ఉండదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వీపీ దీపక్ జోత్వానీ తెలిపారు. అయితే, అమెరికా వెలుపల ఉంటూ, ఆ దేశానికి ఎగుమతి చేసే బ్రాండెడ్ డ్రగ్ కంపెనీలతో కొన్ని భారతీయ ఫార్మా సంస్థలకు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి సదరు కంపెనీలకు యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)లాంటివి సరఫరా చేసే మన కంపెనీలపై పరోక్షంగా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
అటు ప్రధానంగా జనరిక్స్‌నే ఎగుమతి చేస్తుంది కాబట్టి భారత్‌పై టారిఫ్‌ల ఎఫెక్ట్ ఉండదని, కాకపోతే ఈ పరిణామం, భవిష్యత్తులో దేశీయంగా ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి సవాళ్లు ఎదురు కావొచ్చని సూచిస్తోందని ఫౌండేషన్ ఫర్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ వ్యవస్థాపకుడు రాహుల్ అహ్లువాలియా చెప్పారు. ఈ నేపథ్యంలో మన కంపెనీలకు పెద్ద మార్కెట్లు అందుబాటులోకి వచ్చే దిశగా అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అటు అమెరికా వినియోగదారులపై టారిఫ్‌ల భారం మరీ ఎక్కువగా ఉండకుండా కొన్ని కేటగిరీలను మినహాయిస్తూ, తదుపరి చర్యలు ఉండొచ్చని అడ్వైజరీ సేవల సంస్థ ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ హెడ్ లూయీసీ లూ తెలిపారు.