ఇటీవలి కాలంలో ‘వైబ్‌కోడింగ్’ అనే మాట బాగా పాపులర్ అయింది. డిక్షనరీలలో కూడా చేరింది. కంప్యూటర్ సైంటిస్ట్, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఏఐ కోఫౌండర్ ఆండ్రెజ్ కర్పతి (Andrej Karpathy) ద్వారా ‘వైబ్‌కోడింగ్’ అనేది ప్రాచుర్యం పొందింది. కోడర్‌ల నుంచి సామాన్యుల వరకు ‘వైబ్‌కోడింగ్’ చేస్తున్నారు.
ఇంతకీ ఏమిటి ఈ వైబ్‌కోడింగ్? సాఫ్ట్‌వేర్‌ను సృష్టించడానికి చాట్‌బాట్ ఆధారిత విధానాన్ని అనుసరించడమే వైబ్‌కోడింగ్. ఇందులో డెవలపర్ ఒక ప్రాజెక్ట్ లేదా పనికి సంబంధించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్‌ఎల్‌ఎం)కు వివరిస్తారు. ఇది ప్రాంప్ట్ ఆధారంగా కోడ్‌ను జనరేట్ చేస్తుంది. అయితే డెవలపర్ కోడ్‌ను ఎడిట్, రివ్యూ చేయడంలాంటివేమీ చేయడు. మార్పులు చేర్పులు చేసి మరింత మెరుగు పరచాలనుకుంటే ‘ఎల్‌ఎల్‌ఎం’ని అడుగుతాడు. స్థూలంగా చెప్పాలంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో విస్తృత శిక్షణ. నైపుణ్యం లేని అమెచ్యూర్ ప్రోగ్రామర్స్ కూడా వైబ్‌కోడింగ్ ద్వారా సాఫ్ట్‌వేర్ సృష్టించవచ్చు. ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్ట్ కెవిన్ రూస్ ‘వైబ్‌కోడింగ్’ మెథడ్‌ను ఉపయోగించి ఎన్నో స్మాల్ స్కేల్ అప్లికేషన్‌లను రూపొందించాడు.
‘మెనుజెన్’లాంటి ప్రోటోటైప్‌లను నిర్మించడానికి ‘వైబ్‌కోడింగ్’ మెథడ్‌ను ఉపయోగించాడు. ఏదైనా ఎర్రర్ కనిపించినప్పుడు ఆ ఎర్రర్ మెసేజెస్‌ను కామెంట్ లేకుండానే సిస్టమ్‌లో కాపీ, పేస్ట్ చేసేవాడు. దీనితో జరిగిన లోపాలను ఏఐ సవరిస్తుంది. వైబ్ మార్కెటింగ్, వైబ్ డిజైనింగ్, వైబ్ అనలిటిక్స్, వైబ్ వర్కింగ్...ఇలా రకరకాలుగా ‘వైబ్‌కోడింగ్’ పాపులర్ అయింది.
‘వైబ్‌కోడింగ్’లో సానుకూల విషయాలు ఉన్నా విమర్శలు కూడా ఉన్నాయి. ‘జవాబుదారీతనం లోపిస్తుంది’ ‘భద్రతా సమస్యలు ఏర్పడతాయి’ ‘కార్యాచరణ పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఏఐ సృష్టించిన కోడ్‌ను ఉపయోగించడం వల్ల గుర్తించబడని బగ్‌లు, లో΄ాలు, భద్రతాపరమైన సమస్యలు ఏర్పడతాయి’...అనేవి ఆ విమర్శల్లో కొన్ని. ప్రోగ్రామర్‌లు కానివారిని కూడా ఫంక్షనల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి ‘వైబ్‌కోడింగ్’ వీలు కల్పిస్తున్నప్పటికీ ఈ మెథడ్ ద్వారా ‘వందశాతం కరెక్టే’ అనుకోవడానికి లేదు. ఊహించినంత ఫలితాలు రాకపోవచ్చు. ఊహించింది ఒకటి అయితే ఫలితం మరోలా ఉండవచ్చు.
‘లవబుల్’ అనేది స్వీడీష్ వైబ్ కోడింగ్ యాప్. ఈ యాప్ కోసం రూపొందించిన కోడ్‌లో భద్రతా లోపాలు ఉన్నాయని, లవబుల్ వెబ్‌అప్లికేషన్‌లలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని...ఇలా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. ఒక ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఫేక్ రివ్యూలు సృష్టించడానికి ఈ మెథడ్‌ను ఉపయోగించుకున్నారు. వైబ్‌కోడింగ్ గురించి ‘ఐ జస్ట్ సీ థింగ్స్, సే థింగ్స్, రన్ థింగ్స్, అండ్ కాపీ థింగ్స్’ అని కాస్త గొప్పగా చెప్పిన ఆండ్రేజ్ కూడా ఈ మెథడ్‌లోని పరిమితుల గురించి ఎన్నో సందర్భాలలో చెప్పాడు. కొన్ని బగ్స్ రిపేర్‌కు సంబంధించి టూల్స్ విఫలమయ్యాయి అనేది అందులో ఒకటి.


