రిటైల్‌లోకి డి బీర్స్‌ | De Beers plans to open 15 Forevermark brand retail stores in india | Sakshi
Sakshi News home page

రిటైల్‌లోకి డి బీర్స్‌

Jan 30 2025 6:23 AM | Updated on Jan 30 2025 7:53 AM

De Beers plans to open 15 Forevermark brand retail stores in india

న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారంలో ఉన్న దిగ్గజ సంస్థ డి బీర్స్‌ భారత్‌లో రిటైల్‌లోకి ప్రవేశిస్తోంది. ఈ ఏడాది 15 ఫరెవర్‌మార్క్‌ బ్రాండ్‌ స్టోర్లను ప్రారంభించనున్నట్లు బుధవారం తెలిపింది. 2030 నాటికి 100 రిటైల్‌ స్టోర్లను నెలకొల్పాలని యోచిస్తున్నామని డి బీర్స్‌ ఇండియా ఎండీ అమిత్‌ ప్రతిహారి వెల్లడించారు. ‘తద్వారా ఆ సమయానికి ఒక మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 

ఫరెవర్‌మార్క్‌ జ్యువెలరీ బ్రాండ్‌ ద్వారా రిటైల్‌లో పెట్టుబడి పెడుతున్నాం. ఈ ఏడాది ఢిల్లీలో ఎనిమిది, ముంబైలో 15 స్టోర్లను ప్రారంభిస్తాం. జూన్‌–జూలైలో తొలి కేంద్రం రానుంది. మార్కెట్‌ వాటాను పెంచుకోవడానికి సొంతంగా, లేదా ఫ్రాంఛైజీ విధానంలో ప్రత్యేక స్టోర్ల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెడతాం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రాభరణాల మార్కెట్‌గా భారత్‌ నిలిచింది. ఈ పరిశ్రమ ఇక్కడ 10 శాతం మాత్రమే వ్యాప్తి చెందింది.

విస్తరణకు భారీ అవకాశం ఉంది’ అని తెలిపారు. డైమండ్‌ వెరిఫికేషన్‌ టెక్నాలజీతో కూడిన చిన్న పరికరాన్ని కంపెనీ విడుదల చేసిందని, దీనిని భారత్‌లో వాణిజ్యీకరిస్తామని చెప్పారు. వజ్రం సహజమైనదా లేదా కృత్రిమమైనదా అని ఈ పరికరం గుర్తిస్తుందని వివరించారు. సింథటిక్‌ డైమండ్స్‌ వల్ల సహజ వజ్రాల పరిశ్రమకు ఎలాంటి ముప్పు లేదని అన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రెండింటినీ వేరు చేయడానికి నాణ్యత ధృవీకరణ అవసరం ఉందని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement