ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుపై సైబర్‌ అటాక్‌ | Cyber ​​Attack On The World's Largest Bank | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుపై సైబర్‌ అటాక్‌

Published Sat, Nov 11 2023 3:47 PM | Last Updated on Sat, Nov 11 2023 4:09 PM

Cyber ​​Attack On The World Largest Bank - Sakshi

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీరంగం దూసుకుపోతోంది. దానికితోడు మోసాలూ అదే మాదిరి పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి దిగ్గజ సంస్థల వరకు అందరూ వీటి బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్‌పై రాన్సమ్‌వేర్‌ దాడి జరిగినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. 

ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన చైనాకు చెందిన ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(ఐసీబీసీ)పై సైబర్‌దాడి జరిగినట్లు సమాచారం. ఆ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న అమెరికాలోని ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై రాన్సమ్‌వేర్‌ దాడి జరిగినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే సైబర్‌ దాడిని వెంటనే గుర్తించినట్లు ఐసీబీసీ తెలిపింది. ఈ దాడి ఎవరు చేశారనే విషయాలను వెల్లడించలేదు. దీనిపై పూర్తి విచారణ జరగాల్సి ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సైట్‌లను పునరుద్ధరించేందుకు తమ భద్రతా నిపుణుల బృందం పనిచేస్తుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. 

బుధవారం జరిగిన యూఎస్‌ ట్రెజరీ ట్రేడ్‌లు, గురువారం నాటి స్వల్పకాల రుణాలైన రెపో ఫైనాన్సింగ్ ట్రేడ్‌లను విజయవంతంగా క్లియర్ చేసినట్లు  ఐసీబీసీ చెప్పింది. అయితే ఈసైబర్‌దాడికి సంబంధించి ఫెడరల్ రెగ్యులేటర్‌లతో పాటు ఆర్థిక రంగ నిపుణులతో నిత్యం పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు యూఎస్‌ ట్రెజరీ విభాగం వివరించింది. చైనాతో సంబంధం లేకుండా యూఎస్‌ కార్యకలాపాలు స్వతంత్రంగా జరుగుతాయని ఐసీబీసీ వెల్లడించింది. మార్కెట్‌పై ఈ ఘటన పరిమిత ప్రభావాన్ని చూపినట్లు బ్రోకర్ డీలర్ కర్వేచర్ సెక్యూరిటీస్‌ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ స్క్రిమ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ సైబర్‌దాడి తర్వాత ఐసీబీసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకుందని తెలిపారు. 

కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం సైబర్‌దాడికి ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌ వివరాలు లభించినట్లు సమాచారం. స్వీడిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రూసెక్ వ్యవస్థాపకుడు మార్కస్ ముర్రే మాట్లాడుతూ ఈ దాడికి లాక్‌బిట్ 3.0 అనే రాన్సమ్‌వేర్‌ను ఉపయోగించారని చెప్పారు. ఈ రకమైన రాన్సమ్‌వేర్‌ అనేక మార్గాల్లో సంస్థలోని సాఫ్ట్‌వేర్‌లో ప్రవేశించే అవకాశం ఉందని ముర్రే అన్నారు. ఉదాహరణకు ఎవరైనా ఈమెయిల్‌లోని స్పామ్‌ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కూడా ఇది సాఫ్ట్‌వేర్‌లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. కంపెనీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడం దీని లక్ష్యమన్నారు.

ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి

లాక్‌బిట్ 3.0 ప్రతిదశలో మాల్వేర్‌కు ప్రత్యేకమైన పాస్‌వర్డ్ అవసరం ఉంటుంది. అది చేధించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. యూఎస్‌ ప్రభుత్వానికి చెందిన సైబర్‌ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ లాక్‌బిట్ 3.0ని ‘రూపాలు మారుస్తూ తప్పించుకునేది’గా భావిస్తారు. జులై 2022 నుంచి జూన్‌ 2023 వరకు జరిగిన అన్ని రాన్సమ్‌వేర్‌ దాడుల్లో 28శాతం లాక్‌బిట్‌ ద్వారా జరిగినవేనని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఫ్లాష్‌పాయింట్ నివేదిక చెబుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement