చమురు ధరలు తగ్గినా.. పెట్రోల్‌, డీజిల్‌ ఇలా.. | Crude Oil Prices Fall Sharply, Petrol And Diesel Rates Remain Unchanged Across India On June 25th, Check Out Prices Details | Sakshi
Sakshi News home page

చమురు ధరలు తగ్గినా.. పెట్రోల్‌, డీజిల్‌ ఇలా..

Jun 25 2026 8:43 AM | Updated on Jun 25 2026 9:55 AM

Crude Oil Prices Fall Petrol Diesel Rates India On June 25

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినా దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఉపశమనం కనిపించలేదు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు సడలడం వల్ల బ్రెంట్ క్రూడ్ ధర యుద్ధానికి ముందు స్థాయికి చేరుకుంది. గురువారం ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సుమారు 72.5 డాలర్ల వద్ద, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 69 డాలర్లకు సమీపంలో ట్రేడయ్యాయి.

అయితే ఈ పరిణామాల ప్రభావం దేశీయ ఇంధన ధరలపై ఇంకా పడలేదు. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) జూన్ 25న కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను యథాతథంగా కొనసాగించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.102.12, డీజిల్ ధర రూ.95.20గా కొనసాగుతున్నాయి.

గత నెలలో పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడటంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నాలుగు విడతల్లో పెరిగాయి. మే 15 నుంచి మే 25 మధ్య పెట్రోల్‌పై మొత్తం రూ.7.35, డీజిల్‌పై రూ.7.53 వరకు పెంపు జరిగింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర మళ్లీ రూ.100 మార్కును దాటింది.

అయితే తాజాగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు ధరల కోత కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల స్పందిస్తూ, తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురు రిఫైనరీలకు చేరిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సానుకూల ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే తుది నిర్ణయం అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు

  • హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.115.73, డీజిల్ రూ. 103.82

  • ఢిల్లీలో పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ. 95.20

  • ముంబైలో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ. 97.83

  • కోల్‌కతాలో పెట్రోల్ రూ.113.51, డీజిల్ రూ. 99.82

  • చెన్నైలో పెట్రోల్ రూ.108.01, డీజిల్ రూ. 99.66

  • బెంగళూరులో పెట్రోల్ రూ.110.89, డీజిల్ రూ. 98.80

చమురు ధరలు మరింత కాలం తక్కువ స్థాయిలో కొనసాగితే, చమురు సంస్థలపై ఉన్న ఒత్తిడి తగ్గి దేశీయ ఇంధన ధరల్లోనూ తగ్గుదల వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం వినియోగదారులకు వెంటనే ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement