ఢిల్లీలో 102.. విజయవాడలో 118 | Jagan's fuel price question continues to haunt Chandrababu | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో 102.. విజయవాడలో 118

May 25 2026 1:54 PM | Updated on May 25 2026 2:23 PM

Jagan's fuel price question continues to haunt Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడం ఇటు రాజకీయ యుద్ధంగా మారింది. ఎన్నికల ముందు ప్రజలపై భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ధరల తగ్గింపుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “జగన్ హయాంలో పెట్రోల్ రేట్లు పెరిగాయంటూ ప్రచారం చేశారు.. మరి ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదు?” అనే గొంతుక సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

తాజాగా పెంచిన ఇంధన ధరలతో..  దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102 వద్ద ఉండగా.. విజయవాడలో అది రూ.118కి చేరడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.115.69గా ఉంది. అంటే పొరుగు రాష్ట్రంతో పోల్చినా కూడా ఏపీలోనే ఇంధన భారం ఎక్కువగా పడుతోంది. కానీ, టీడీపీ అనుకూల మీడియా మాత్రం హైదరాబాద్‌ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తూ.. ఏపీలో రేట్లను ఏ మూలన ప్రస్తావించడం లేదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయన్నది తెలిసిందే. సామాన్యుల జేబుకు చిల్లుపడే విషయంలో.. ఆయిల్‌ కంపెనీలు, కేంద్రం చేతులెత్తాశాయి. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు మరింత ఎక్కువగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక వ్యాట్‌, అదనపు సెస్సులేనని విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌తో పాటు లీటరుకు అదనంగా రూ.4 వ్యాట్‌, మరో రూ.1 రోడ్ డెవలప్‌మెంట్ సెస్సు వసూలు చేస్తున్నారు. ఇందులో అదనపు వ్యాట్‌, ఇతర భారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమలులోకి వచ్చిందని మొన్నటి ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.( 2015లో అప్పటి బాబు సర్కార్‌ ఫిబ్రవరి 5వ తేదీన ఇచ్చిన జీవోలో.. పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌ విధించారు. వ్యాట్‌కు అదనంగా ప్రతి లీటర్‌పై రూ.4 వడ్డించారు). అయితే.. కరోనా వంటి కష్టకాలంలో కూడా తమ ప్రభుత్వం కేవలం రోడ్ సెస్సు కింద ఒక్క రూపాయి మాత్రమే పెంచిందని ఆయన వివరించారు. అదే సమయంలో చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెరిగాయని ప్రచారం చేశారని.. అధికారంలోకి వస్తే తగ్గిస్తామని మాటిచ్చారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మౌనం వహిస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. 

జగన్‌ చెప్పిన లెక్క ప్రకారం.. 
దేశవ్యాప్తంగా.. గత 10 రోజుల్లో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. మే 15 నుంచి ఇప్పటివరకు దేశ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.8 పెరిగింది. ఈ ప్రభావంతోనే విజయవాడలో ధరలు మరింత ఎగబాకాయి. దీంతో “ఏపీలో సామాన్యుడికి భారం” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే..

జగన్ తాజా వ్యాఖ్యల్లో మరో కీలక ప్రశ్న కూడా లేవనెత్తారు. “ఎన్నికల ముందు పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఓట్లు అడిగారు. జగన్ హయాంలో పెరిగిందని విమర్శించారు. అప్పుడు అంత విమర్శించారు కాబట్టి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించాలి కదా? మరి ఎందుకు పెరుగుతున్నాయ్‌” అని చంద్రబాబు జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్‌ ప్రెస్‌మీట్‌ నాటికి పెట్రో ధరలు రూ.4 పెరిగాయి. ఈ మధ్యలోనే మరో నాలుగు రూపాయలు పెరిగింది. ఈ లెక్కన జగన్‌ కోరినట్లు ఆ రూ. 8 చంద్రబాబు తగ్గింపు చేసి ఉంటే.. ఏపీలో వాహనదారులపై భారం చాలా వరకు తగ్గేదే అనే అభిప్రాయం వినిపిస్తోంది.  

ఇక.. ఇంధన ధరల వ్యవహారంలో ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన విమర్శలు, ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కనిపిస్తున్న వైఖరి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందనే అభిప్రాయం ఆరోపిస్తోంది. “జగన్ హయాంలో పెట్రోల్ భారం” అంటూ ప్రచారం చేసిన నేతలు.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధరలు ఏపీలో ఉన్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ అడిగిన దానికి సమాధానం ఏదని నిలదీస్తున్నారు. మరోవైపు హామీల్లో తగ్గింపు మాటలు చెప్పి.. చేతల్లో మాత్రం అదనపు భారం కొనసాగిస్తుండటంతో ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు “మాటల బాబు.. చేతల్లో ఎక్కడ?” అని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement