థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సీతారామన్‌ సన్నద్ధం!

Covid Pandemic and economic challenges for FM Nirmala Sitharaman - Sakshi

2022–23 బడ్జెట్‌లో కీలక చర్యలు

దీనితో ద్రవ్యలోటు పెరిగే అవకాశం

బార్‌క్లేస్‌ ఇండియా నివేదిక  

ముంబై: కోవిడ్‌–19 మూడవ వేవ్‌ను ఎదుర్కొంటున్న భారత్‌ ఎకానమీని సవాళ్ల నుంచి గట్టెక్కించడానికి, బలహీనంగా ఉన్న రికవరీకి మద్దతును అందించడానికి ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ రానున్న వార్షిక బడ్జెట్‌లో పలు ద్రవ్యపరమైన చర్యలను తీసుకునే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ బార్‌క్లేస్‌ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది.

ఇది ద్రవ్యలోటు పెరుగుదలకు దారితీయవచ్చని వివరించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో 2022–23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. బార్‌క్లేస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఎకనమిస్ట్‌ రాహుల్‌ బజోరియా వెల్లడించిన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

► 2021–22 బడ్జెట్‌లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తలో (జీడీపీ)6.8 శాతం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అయితే 7.1 శాతానికి ఈ పరిమాణం పెరిగే అవకాశం ఉంది.  
► కన్సాలిడేటెడ్‌ (కేంద్రం, రాష్ట్రాలు) ద్రవ్యలోటు 2021–22లో  11.1 శాతంగా ఉండే వీలుంది. కేంద్రం విషయంలో ఇది 7.1 శాతం అయితే, రాష్ట్రాలకు సంబంధించి 4 శాతంగా ఉం టుందన్నది అంచనా. కన్సాలిడేటెడ్‌ ద్రవ్యలోటు వచ్చే ఐదేళ్లలో 7 శాతం దిశగా దిగిరావచ్చు.
► 2022–23లో కన్సాలిటేడెడ్‌ ద్రవ్యలోటు 10.5 శాతానికి తగ్గవచ్చు. ఇందులో కేంద్రం వాటా 6.5 శాతంగా (రూ.17.5 లక్షల కోట్లు) నమోదుకావచ్చు.
► ఆయా అంశాల నేపథ్యంలో కేంద్రం వ్యయాల మొత్తం దాదాపు రూ.41.8 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది.  
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రుణాలు రూ.12 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ. 16 లక్షల కోట్లకు పెరిగే వీలుంది.  
► కొత్త బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలకు వ్యయాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ద్రవ్యలోటు పెరుగుదలకు ఇది దారితీస్తుంది.  
► ఇప్పటికే బలహీనంగా ఉన్న రికవరీ పటిష్టతకు మూలధన వ్యయాల పెంపు అవసరం.  
► పన్ను, పన్ను యేతర ఆదాయాలు  2021–22లో అలాగే 2022–23లో బడ్జెట్‌ లక్ష్యాలను అధిగమించే వీలుంది.     
► ప్రస్తుత ధరల ప్రాతిపదిక (నామినల్‌ బేస్‌) జీడీపీ 2021–22లో 19.6 శాతంగా నమోదుకావచ్చు. ప్రభుత్వ అంచనా (17.4 శాతం) ఇది అధికం కావడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నామినల్‌ ఎకానమీ విలువ 13.6 శాతం పెరిగే అవకాశం ఉంది.  

ద్రవ్యలోటు ధోరణి ఇది...
కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్యలోటు 9.3 (బడ్జెట్‌ లక్ష్యం 3.5 శాతానికి మించి) శాతంగా నమోదయ్యింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీనిని 6.8 శాతం (రూ.15.06 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని 2021–22 బడ్జెట్‌ నిర్దేశించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని  సీతారామన్‌ 2021–22 బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

15వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాలి. కాగా, ద్రవ్యలోటు విషయంలో కొంత ధైర్య సాహసాలతో కూడిన విధానాన్ని అనుసరించాలని ప్రముఖ బ్యాంకర్‌ కేవీ కామత్‌ లాంటి వారు సూచిస్తుండడం మరో విషయం.  

ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ తద్వారా ఒనగూడింది కేవలం రూ.9,330 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.   కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) బాండ్ల జారీ ద్వారా 7.02 లక్షల కోట్లు సమీకరించింది. మొత్తం రూ.12.05 లక్షల కోట్ల సమీకరణలో భాగంగా  అక్టోబర్‌ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top