కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యకరమైన జీవితంపై శ్రద్ధ పెరిగింది. తినే తిండి నుంచి ఉండే ఇల్లు వరకూ ఎంపికలో రిస్క్ తీసుకోవట్లేదు. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, పచ్చని ప్రకృతిలో నివాసం ఉండాలని భావిస్తున్నారు. ఫలితంగా ఫామ్ ప్లాట్లకు, ఫామ్‌హౌస్‌లకు డిమాండ్ పెరిగింది. కనీసం ఇంటి చుట్లూ కనీస నాలుగు చెట్లయినా ఉండాలనుకుంటున్నారు. మరి, ఫామ్ ప్లాట్లలో భవనాలకు నిర్మాణ అనుమతులు రావు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. దీంతో కంటైనర్ హోమ్స్‌కు గిరాకీ పెరిగింది. ఫ్యాక్టరీలో తయారు చేయడం, లారీలో తీసికొచ్చి బిగించేయడం వీటి ప్రత్యేకత.
శామీర్‌పేట, కొంపల్లి, కందుకూరు, చేవెళ్ల, భువనగిరి, సదాశివపేట, ఆదిభట్ల, మేడ్చల్ వంటి శివారు ప్రాంతాలలోని ఫామ్‌హౌస్, రిసార్ట్‌లలో కంటైనర్ హోమ్స్ ఎక్కువ డిమాండ్ ఉంది. విదేశాల్లో మాదిరిగా ఇప్పుడిప్పుడే ఆఫీసులు, హోటళ్లు, వసతి గృహాలు, ఆధ్మాత్రిక ప్రాంతాలలో ఈ తరహావే ఏర్పాటు చేసేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. 111 జీవోలో నిర్మాణాలకు అనుమతులు లేకపోవటంతో పలువురు ఈ కంటైనర్ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి ఆయా హోమ్స్‌లో సరదాగా గడుపుతున్నారు.
ఎలా తయారు చేస్తారంటే..
కంటైనర్ హోమ్స్‌ను గ్యాల్వనైజింగ్ స్టీల్స్(జీఏ) షీట్లతో తయారు చేస్తారు. కింద భాగంలో గ్రిడ్ వేసి సిమెంట్, కలప మిశ్రమంతో తయారైన బైసన్ బోర్డ్ వేస్తారు. దానిపైన పాలీ వినైల్ ఫ్లోర్(పీవీసీ) ఉంటుంది. పీవీసీ వద్దనుకుంటే బైసన్ బోర్డ్ మీద టైల్స్ కూడా వేసుకోవచ్చు.
ఇంటి బీమ్‌లు, ఫౌండేషన్ స్ట్రక్చర్‌లను ఉక్కుతో నిర్మిస్తారు. గాల్వనైజ్ పూతతో ఉంటుంది. ప్రధాన స్ట్రక్చరల్ ఫ్రేమ్, ఫ్లోర్, బాహ్య, అంతర్గత గోడలు, సీలింగ్ ప్యానల్స్‌లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ఫినిష్డ్ వ్యాల్యుమెట్రిక్ కన్‌స్ట్రక్షన్(పీపీవీసీ)లతో రూపొందిస్తారు.
తలుపులు, కిటికీలు ఇంపాక్ట్ రెసిస్టెంట్ గ్లాస్‌లతో ఏర్పాటు చేస్తారు. గాలి, తేమలను నిరోధించేలా నాన్ వుడ్ కాంపోజిట్, సిమెంట్ బోర్డ్‌లతో బహుళ పొరలను ఏర్పాటు చేస్తారు. థర్మల్ ఇన్యులేషన్‌తో వాల్ ప్యానెల్ క్లాడింగ్‌లను ఏర్పాటు చేస్తారు. దీంతో అగ్ని, వేడి ఇంటిలోపలికి రాదు. బయటి వాతావరణం కంటే 6–7 డిగ్రీల ఉష్ణోగత కంటైనర్ హోమ్‌లో తక్కువగా ఉంటుంది.

ధరలు ఎలా ఉంటాయంటే?
విస్తీర్ణాన్ని బట్టి కంటైనర్ హోమ్స్ ధరలు ఉంటాయి. ప్రారంభ ధర చదరపు అడుగు (చ.అ)కు రూ.1,300. ఉదాహరణకు 600 చ.అ. మాడ్యులర్ హోమ్‌కు రూ.7.80 లక్షలు. క్రేన్, రవాణా చార్జీలు కూడా కలిపితే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ మాడ్యులర్ హోమ్‌లో హాల్‌లోనే ఓపెన్ కిచెన్, బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ బాత్‌రూమ్ ఉంటుంది. దీని నిర్మాణానికి 4–5 మంది కలిసి 45 రోజుల్లో పూర్తి చేస్తారు.
కంటైనర్ హోమ్స్‌లో మన అభిరుచుల మేరకు హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఏ వసతులను ఏర్పాటు చేసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్‌ల సమక్షంలో వీటిని తయారు చేస్తారు.
మన్నిక ఎన్నేళ్లంటే?
ఈ కంటైనర్ హోమ్స్ స్ట్రక్చరల్ వారంటీ 50–60 ఏళ్లు ఉంటుంది. ఇంటి తయారీలో వినియోగించిన అంతిమ ఉత్పత్తి డ్యూరబుల్ వారంటీ 25 ఏళ్లు ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో సాధారణ అపార్ట్‌మెంట్‌కు ఎలాగైతే నిర్వహణ చేసుకుంటామో ఈ కంటైనర్ హోమ్స్‌కు కూడా ఐదారేళ్లకొకసారి రంగులు, పాలిష్ చేసుకోవాలి. 1,000 చ.అ. బిల్డింగ్‌కు వార్షిక నిర్వహణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుంది. ఈ కంటైనర్ హోమ్స్‌ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. మెటల్‌తోనే వీటిని తయారు చేస్తారు కాబట్టి డబ్బులు తిరిగొస్తాయి. ఎక్కువ నష్టం జరగదు.
ఇదీ చదవండి: ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!


