
కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: గత 15 నెలలుగా ద్రవీకృత గ్యాస్ (ఎల్‌పీజీ)ని తక్కువ రేట్లకు విక్రయించడం వల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాటిల్లిన నష్టాలను భర్తీ చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకోసం సుమారు రూ. 30,000–50,000 కోట్లు సబ్సిడీ ఇచ్చే అవకాశమున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎంత నష్టం (అండర్ రికవరీలు) వాటిల్లింది, దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి అనే అంశాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. 2025–26 బడ్జెట్‌లో అండర్–రికవరీలకు కేటాయింపులు చేయలేదు. అయితే, ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు పెంచడం ద్వారా అదనంగా రూ. 32,000 కోట్లు సమకూర్చుకుంది. ఇలా అదనంగా వచి్చన ఆదాయాన్నే ఎల్‌పీజీ అండర్ రికవరీలకి కేంద్రం సర్దుబాటు చేసే అవకాశం ఉంది.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)కు 2024–25లో ఎల్‌పీజీ విక్రయాలపై సుమారు రూ. 40,500 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో అధిక రేట్ల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వమే వంట గ్యాస్ ధరలను నియంత్రిస్తోంది. దీనితో మార్కెట్ రేటు కన్నా తక్కువకి విక్రయించడం వల్ల కంపెనీలకు నష్టం వాటిల్లితే, దాన్ని ఇతరత్రా మార్గాల్లో భర్తీ చేస్తోంది. ఇలా 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 28,249 కోట్ల అండర్ రికవరీలకు గాను రూ. 22,000 కోట్లు సర్దుబాటు చేసింది.