న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వివిధ విభాగాల్లోని సిబ్బందికి అత్యుత్తమ ఆడిట్ విధానాల్లో శిక్షణనిచ్చేందుకు హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ని ఏర్పాటు చేయనుంది. 32వ అకౌంటెంట్స్ జనరల్ కాన్ఫరెన్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాగ్ కె. సంజయ్ మూర్తి ఈ మేరకు ప్రకటన చేశారు.
ఆవిష్కరణలు, పరిశోధనలు మొదలైన వాటికి ఇది జాతీయ స్థాయి హబ్‌గా ఉంటుందని డిప్యుటీ కాగ్ ఏఎం బజాజ్ తెలిపారు. అంతర్జాతీయంగా పాటించే అత్యుత్తమ ప్రమాణాల అమలు, అధునాతన నైపుణ్యాలను పెంపొందించేందుకు, నాణ్యమైన ఆడిట్ విధానాలను వివిధ విభాగాలవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇన్‌క్యుబేటరుగా ఉంటుందని వివరించారు. డేటా, ఏఐని ఉపయోగించుకుని ఆడిట్ విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపారు.


