40 ఏళ్లు వచ్చాక ఇల్లు కొంటుంటే.. | Buying home in 40s age key things to keep in mind | Sakshi
Sakshi News home page

40 ఏళ్లు వచ్చాక ఇల్లు కొంటుంటే..

Nov 16 2025 9:39 AM | Updated on Nov 16 2025 10:35 AM

Buying home in 40s age key things to keep in mind

సొంతిల్లు.. దాదాపు ప్రతి ఒక్కరికీ జీవిత ఆశయం. కొంత మంది తక్కువ వయస్సులోనే సొంతిల్లు సమకూర్చుకుంటారు. కానీ చాలా మంది 40 ఏళ్లు వచ్చాక కూడా దీని కోసమే పోరాడుతుంటారు. ఉద్యోగం, వ్యాపారంలో కుదురుకోవడం, పెళ్లి, పిల్లలు ఇలా అన్నీ అయ్యాక సొంతింటి పని పడతారు. అయితే 40ల వయసులో ఇల్లు కొనేవాళ్లు ముఖ్యంగా గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..

40లలో ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా స్థిరంగా పెరుగుతాయి. పిల్లల చదువు, తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి వ్యయాలు కచ్చితంగా ఉంటాయి. అందుకే గృహ రుణం ఈ వాస్తవాలకు సరిపోయేలా ఉండాలి. ఈఎంఐలు మీ రిటైర్మెంట్ పొదుపులను తగ్గించకూడదు. నిత్య ఖర్చులకు క్రెడిట్ కార్డులపై ఆధారపడేలా చేయకూడదు.

ఎలాంటి ప్రాపర్టీ కొనాలి?
40ల్లో ప్రాధాన్యతలు మారతాయి. ఇప్పుడు ‘హాట్’ లొకేషన్ కంటే రోజువారీ సౌలభ్యం ముఖ్యం. అంటే ప్రయాణ సమయం తక్కువ ఉండటం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, పాఠశాలలు, ఆసుపత్రులు అందుబాటులో ఉండే ప్రాపర్టీని ఎంచుకోవాలి. తెలిసిన ప్రాంతమైతే మరీ మంచిది. రెడీ-టు-మూవ్ అంటే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఉత్తమం. ఇవి నిర్మాణ ఆలస్యం రిస్క్‌ను తగ్గిస్తాయి. క్యాష్ ఫ్లో ప్రణాళికను సులభతరం చేస్తాయి. అయితే కొనుగోలు ముందు రెరా (RERA) వివరాలు, కంప్లీషన్ సర్టిఫికేట్లు, సొసైటీ నిబంధనలు, పెండింగ్‌ బకాయిలను తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి.

40ల తర్వాత హోమ్‌ లోన్‌ తీసుకుంటే..
సాధారణంగా బ్యాంకులు కానీ, రుణ సంస్థలు కానీ తామిచ్చే లోన్లను రుణగ్రహీత రిటైర్‌ అయ్యేలోపు రికవరీ అయ్యేలా చూసుకుంటాయి. అందులో భాగంగా రుణ చెల్లింపు వ్యవధి తక్కువ ఉంటుంది. ఫలితంగా నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ భారం పెరుగుతుంది. దీన్ని సమతుల్యం చేయడానికి చాలా మంది దంపతులు జాయింట్‌ లోన్‌ తీసుకుంటారు. డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తారు. తద్వారా ఈఎంఐ చెల్లించదగిన స్థాయిలో ఉంటుంది.

రిటైర్మెంట్ ప్రణాళికను దెబ్బతీయకూడదు
మంచి ఇల్లు కొనాలన్న ఉత్సాహం రిటైర్మెంట్ సేవింగ్స్‌ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, దీర్ఘకాల సిప్‌లు వంటి పొదుపులపై ప్రభావం లేకుండా చూసుకోవాలి. దీని కోసం ఒక సింపుల్‌ పరీక్ష ఉంది. అదేంటంటే.. ఇంటి ఈఎంఐ కారణంగా మీ రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్లను రెండు మూడు నెలలకు పైగా నిలిపివేయాల్సి వచ్చేలా ఉంటే ఆ ఇంటి కొనుగోలు ప్లాన​్‌ మార్చుకుని చిన్న ఇల్లు కొనడమో లేదా డౌన్ పేమెంట్ ఇంకాస్త పెంచుకోవడమో చేయాలి.

ఎక్కువ డౌన్ పేమెంట్ మేలు
డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువైతే అంత మేలు. ఏళ్లుగా పోగుచేసుకున్న డబ్బుతో డౌన్ పేమెంట్ కాస్త ఎక్కువగా పెట్టగలిగితే నెల నెలా ఈఎంఐ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. తద్వారా మీ అత్యవసర నిధికి ఎలాంటి డోకా ఉండదు. ప్రతినెలా పెద్దగా ఒత్తిడి లేకుండా మనశ్శాంతిగా ఉండొచ్చు.

ఇన్సూరెన్సులూ ముఖ్యమే..
హోమ్ లోన్ మీ ఫైనాన్షియల్ రిస్క్‌ను పెంచుతుంది. అందుకే రుణ బకాయికి కనీసం సరిపడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అత్యవసరం. ఇవి లేకపోతే కుటుంబ రుణ సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement