ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు | Burjeel Holdings Announces Rs 37 Crore for Healthcare Workers | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు

Jan 20 2026 12:23 AM | Updated on Jan 20 2026 1:05 AM

Burjeel Holdings Announces Rs 37 Crore for Healthcare Workers

అబుదాబి: రోగుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లకు 15 మిలియన్ దిర్హామ్స్‌ (సుమారు రూ.37 కోట్లు) ఆర్థిక సహాయం అందించనున్నట్లు మిడిల్ ఈస్ట్‌లోని ప్రముఖ హెల్త్‌కేర్ ప్రొవైడర్ బుర్జీల్ హోల్డింగ్స్ ప్రకటించింది. బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో డాక్టర్ షంషీర్ వయాలిల్ అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో నిర్వహించిన గ్రూప్ వార్షిక టౌన్‌హాల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు.

ఈ కార్యక్రమంలో 8,500 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. బుర్జీల్ హోల్డింగ్స్ ‘బుర్జీల్ 2.0’ పేరుతో వృద్ధి తదుపరి దశలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా, ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ‘బుర్జీల్ ప్రైడ్’ ఇనిషియేటివ్‌లో భాగంగా ప్రకటించారు. గ్రూప్‌కు చెందిన నర్సింగ్, పేషెంట్ కేర్, ఆపరేషన్స్, అనుబంధ సేవల విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 10,000 మంది ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లు  ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు. అర్హత కలిగిన ఉద్యోగులకు వారి సర్వీస్‌ కాలాన్ని బట్టి ఒక నెల లేదా అర నెల ప్రాథమిక వేతనానికి సమానమైన మొత్తాన్ని అందించనున్నారు.

డాక్టర్ షంషీర్ ప్రసంగం ఇంకా కొనసాగుతుండగానే ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు వచ్చిన అనూహ్య ఎస్‌ఎంఎస్ ద్వారా ఈ ఆర్థిక సాయం విషయం వెల్లడైంది. ఈ ప్రకటనకు ఉద్యోగుల నుంచి భారీ చప్పట్లు, భావోద్వేగ స్పందనలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి.

“ఇది ఎలాంటి షరతులు లేకుండా అందించే గుర్తింపు. ఆరోగ్య సేవలకు వెన్నెముకగా నిలిచే ఫ్రంట్‌లైన్ బృందాల సమిష్టి కృషికి ఇది మా కృతజ్ఞత. వారు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లోనూ రోగులతో నేరుగా పనిచేస్తూ, రియల్‌టైమ్‌లో సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ సహాయం వారి పట్ల మా నమ్మకం, గౌరవానికి నిదర్శనం” అని డాక్టర్ షంషీర్ తెలిపారు.

బుర్జీల్ హోల్డింగ్స్ ఎదుగుదలకు యూఏఈ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహం అమూల్యమని ఆయన పేర్కొన్నారు. దేశ నాయకత్వం చూపిన దిశే ఈ పురోగతికి పునాదిగా నిలిచిందని అన్నారు. ప్రస్తుతం యూఏఈలో అతిపెద్ద హెల్త్‌కేర్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఒకటైన బుర్జీల్ హోల్డింగ్స్‌లో 14,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement