
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ నెట్‌వర్క్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (శనివారం) ప్రారంభించనున్నారు. దీనితో టెలికం పరికరాలను పూర్తిగా దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటున్న చైనా, డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా సరసన అయిదో దేశంగా భారత్ కూడా చేరనుంది.
బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన 97,500 మొబైల్ 4జీ టవర్లను ఒరిస్సాలోని ఝర్సుగూడలో ప్రధాని ప్రారంభిస్తారని, ఇది భారతీయ టెలికం రంగానికి ఒక కొత్త శకంలాంటిదని కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇందులో 92,600 మొబైల్ సైట్లు పూర్తిగా స్వదేశీ 4జీ టెక్నాలజీతో రూపొందినవని, వీటిని 5జీకి అప్‌గ్రేడ్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు.
కోర్ నెట్‌వర్క్ సిస్టమ్‌ను సీ–డాట్, రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ర్యాన్) సిస్టమ్‌ను తేజస్ నెట్‌వర్క్ రూపొందించగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వీటిని అనుసంధానం చేసింది. మరోవైపు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్‌టెల్ కలిసి 4,700 మొబైల్ 4జీ టవర్లను ఇన్‌స్టాల్ చేశాయి. ఈ టవర్లతో మారుమూల, సరిహద్దు ప్రాంతాల్లోని 26,700 గ్రామాలకు కవరేజీ లభిస్తుంది. తద్వారా ఇరవై లక్షల మంది పైగా సబ్‌స్క్రైబర్స్‌కు సర్వీసులు అందుతాయి.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!