కేంద్ర విద్యుత్ శాఖ ముసాయిదా ప్రతిపాదనలు
దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, పట్టణీకరణ ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ వైపు కీలక అడుగు వేసింది. కొత్తగా నిర్మించే పెద్ద వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయ భవనాలకు ఇంధన సామర్థ్య, సుస్థిరతా ప్రమాణాలను నిర్బంధం చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సంప్రదింపులతో రూపొందించిన ఈ ముసాయిదా నిబంధనలు భారత ఇంధన భద్రతలో మార్పులు తీసుకురానున్నాయి.
20,000 చదరపు మీటర్ల విస్తీర్ణమే ప్రామాణికం
కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. 20,000 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ బిల్ట్-అప్ ఏరియా కలిగిన ప్రతి నూతన భవన సముదాయానికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ తర్వాత ప్రారంభమయ్యే ప్రాజెక్టులకు మాత్రమే ఇవి అమలులోకి వస్తాయి. ప్రస్తుతం దేశంలో భవనాల విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయడానికి సరైన జాతీయ సమగ్ర వ్యవస్థ లేదు. దీనివల్ల వివిధ రాష్ట్రాల్లో, వేర్వేరు రకాల భవన నిర్మాణాల్లో ఎనర్జీ పొదుపు ప్రమాణాలు ఏకరూపంగా అమలు కావడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
రేటింగ్ సంస్థల నమోదు
నూతన ప్రతిపాదనల ప్రకారం దేశంలో సేవలు అందిస్తున్న ప్రధాన భవన రేటింగ్ ఏజెన్సీలు.. గ్రిహా, ఐజీబీసీ, లీడ్, జెమ్.. వంటివన్నీ తప్పనిసరిగా బీఈఈ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బీఈఈ నిర్దేశించిన ఇంధన సామర్థ్య ప్రమాణాల ఆధారంగానే ఈ ఏజెన్సీలు భవనాలకు రేటింగ్ ఇస్తాయి. దీనివల్ల వినియోగదారులకు, డెవలపర్లకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన విశ్వసనీయ ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయి.
భారతదేశంలో మొత్తం విద్యుత్ వినియోగంలో దాదాపు మూడో వంతు ఒక్క భవనాల రంగానికే ఖర్చవుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిన ఎయిర్ కండిషనింగ్, లైటింగ్, హీటింగ్ అవసరాల వల్ల రాబోయే 10-15 ఏళ్లలో ఈ విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో ఈ నూతన సంస్కరణలు దేశ ఇంధన భద్రతను పటిష్టం చేయడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించి, సుస్థిరాభివృద్ధి సాధనలో భారత్ చేపడుతున్న అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాలకు బలమైన ఊతాన్ని ఇస్తాయని కేంద్రం వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి: పసిడి తగ్గినా.. ‘గోల్డ్ బాండ్ల’ జోరు తగ్గేదేలే..


