కరెంట్ కొంటూ షాకులిస్తూ.. | Genco power generation capacity has not increased by a single megawatt | Sakshi
Sakshi News home page

కరెంట్ కొంటూ షాకులిస్తూ..

Jun 26 2026 4:33 AM | Updated on Jun 26 2026 4:33 AM

Genco power generation capacity has not increased by a single megawatt

రూ.4,476.03 కోట్లతో 7,486 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు

షార్ట్‌ టెర్మ్‌ కొనుగోళ్లకు యూనిట్‌కు రూ.5.68 నుంచి రూ.5.98 చెల్లింపు 

గ్రిడ్‌కు అదనంగా ఒక్క యూనిట్‌ కూడా చేరని పునరుత్పాదక విద్యుత్‌ 

ఒక్క మెగావాట్‌ కూడా పెరగని జెన్‌కో విద్యుదుత్పత్తి సామర్థ్యం

రెండేళ్లుగా బహిరంగ మార్కెట్‌పైనే ఆధారపడుతున్న దుస్థితి 

సాక్షి, అమరావతి :  తాము అధికారంలోకి వచ్చాక బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొనుగోలు చేయడం లేదని టీడీపీ కూటమి సర్కారు కాకి లెక్కలు చెబుతోందని అధికారిక గణాంకాల సాక్షిగా తేలిపోయింది. చంద్రబాబు సర్కారు రెండేళ్ల పాలనలో విద్యుదుత్పత్తి పెంచడంలో ఎలాంటి ఫలితాలు సాధించకపోగా మార్కెట్‌ నుంచి భారీ స్థాయిలో విద్యుత్‌ కొనుగోళ్లు చేపట్టినట్లు అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి. 2024–25లో 3,930 మిలియన్‌ యూనిట్లు, 2025–26లో 3,556 మిలియన్‌ యూనిట్లు చొప్పున బహిరంగ మార్కెట్‌లో కూటమి ప్రభుత్వం కరెంట్‌ కొనుగోలు చేసింది. అంతిమంగా ఈ భారం మొత్తం ప్రజలపైనే పడనుంది.  

రూ.4,476.03 కోట్లు వ్యయం.. 
కూటమి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–26 మధ్య కాలంలో షార్ట్‌ టర్మ్‌ మార్కెట్‌ ద్వారా 7,486 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ కొనుగోలు చేసింది. రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు బహిరంగ మార్కెట్‌పైనే ఆధారపడింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ రెండేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో ఒక్క మెగావాట్‌ కూడా పెరుగుదల నమోదు కాకపోవడం! అదే 2019–24 మధ్య గత ప్రభుత్వంలో 1,576 మెగావాట్ల సామర్థ్యం జత కాగా.. 2024–26 వరకు కొత్తగా ఒక్క మెగావాట్‌ కూడా జత కాలేదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 

సొంత ఉత్పత్తి సామర్థ్యం పెరగకపోవడంతో విద్యుత్‌ కొనుగోళ్లు తప్పని పరిస్థితిగా మారాయి. ఇక గ్రిడ్‌కు అదనంగా ఒక్క యూనిట్‌ కూడా పునరుత్పాదక విద్యుత్‌ సమకూరలేదు. దీంతో మార్కెట్‌ ధరలు పెరిగిన ప్రతిసారీ ఆ భారం నేరుగా డిస్కంలపై, చివరకు ప్రజలపైనే పడే దుస్థితి ఏర్పడింది. కూటమి సర్కారు తాజాగా విడుదల చేసిన ప్రగతి నివేదికలోని మరో కీలక అంశం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

గతంలో షార్ట్‌ టర్మ్‌ మార్కె­ట్‌ విద్యుత్‌ కొనుగోలు ధర యూనిట్‌కు రూ. 4.02 ఉంటే.. కూటమి ప్రభుత్వంలో అది ఏకంగా రూ.5.68 నుంచి రూ.5.98 వరకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అంటే అత్యవసర కొనుగోళ్లు.. సాధారణ దీర్ఘకాలిక ఒప్పందాల కంటే చాలా ఖరీదైనవిగా మారినట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కన ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలో 7,486 మిలియన్‌ యూనిట్ల కొనుగోళ్లకు దాదాపు రూ.4,476.03 కోట్లు వ్యయం చేసింది. 

కాగితాలకే పరిమితం.. 
కూటమి ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగంలో 5,541 మెగావాట్ల సామర్ధ్యాన్ని కొత్తగా జత చేశామని చెబుతోంది. వాస్తవానికి ఆ ప్రాజెక్టుల నుంచి పూర్తి స్థాయి విద్యుత్‌ ఉత్పత్తి అందుబాటులోకి రాలేదు. కనీసం వాటి నుంచి సమకూరినా మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మరోవైపు విద్యుత్‌ సంస్థలు ఇంకా రూ.29,618 కోట్ల నష్టాల్లో కొనసాగుతుండగా.. రూ. 33,950 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది.

విద్యుత్‌ రంగంలో రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలేవీ లేకపోగా.. సొంత ఉత్పత్తి సామర్థ్యం పెంచకుండా మార్కెట్‌ కొనుగోళ్లపైనే ఆధారపడటం, ఖరీదైన విద్యుత్‌ కొనుగోళ్లతో భవిష్యత్‌లో ప్రజలపై ఆర్థిక భారం పెరగడం, డిస్కమ్‌లు మరింత నష్టాల్లో కూరుకుపోవడం లాంటివి ప్రగతి నివేదికలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement