
సైబర్ నేరాలు భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్న నేపథ్యంలో దేశంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ భద్రతను పటిష్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారతదేశంలోని టాప్ 200 బ్యాంకులు తమ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను కొత్త, సురక్షితమైన, ప్రత్యేకమైన డొమైన్ ‘.bank.in’కు మార్చాలని తెలిపింది. అక్టోబర్ 31, 2025 నాటికి దీని అమలును పూర్తి చేయాలని అన్ని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది.
సైబర్ సెక్యూరిటీ పెంచడమే లక్ష్యం
పెరుగుతున్న సైబర్ సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించడానికి ఆర్‌బీఐ ఈమేరకు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం, బ్యాంకులు .com, .in, .co.in వంటి సాధారణ డొమైన్ల కింద కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ డొమైన్‌లను సైబర్ నేరగాళ్లు సులభంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఫిషింగ్, స్పూఫింగ్ దాడుల ద్వారా వినియోగదారులను మోసం చేసి వారి సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT) డైరెక్టర్ దీపక్ కుమార్ స్పందిస్తూ..‘కొత్తగా ఆర్‌బీఐ ప్రతిపాదించిన .bank.in డొమైన్‌తో వినియోగదారులు చట్టబద్ధమైన బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లను మాత్రమే యాక్సెస్ చేస్తున్నారని నమ్మకంగా ఉండవచ్చు. రిజిస్టర్డ్ భారతీయ బ్యాంకులు మాత్రమే వెబ్‌సైట్‌లను హోస్ట్ చేయగల సర్వీసులను అందించడం ద్వారా ఫిషింగ్ దాడులను గణనీయంగా తగ్గించవచ్చు. ఇది ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో 95% ఇప్పటికే ఈమేరకు చర్యలు పూర్తయ్యాయి. ముఖ్యంగా 12 ప్రభుత్వం ప్రధాన ప్రైవేట్ రంగ సంస్థలతోపాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు .bank.in యూఆర్‌ఎల్‌ను పొందాయి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: అమెరికా షట్‌డౌన్‌తో భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత?