జియో క్రెడిట్‌లో 49.9 శాతం వాటా
ముంబై: ముకేశ్ అంబానీ ప్రమోట్ చేసిన ఎన్‌బీఎఫ్‌సీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికా(బోఫా) 1.9 బిలియన్ డాలర్లు (రూ. 18,268 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా జియో క్రెడిట్‌లో 49.9% వాటా సొంతం చేసుకోనుంది. ఇందుకు రెండు సంస్థలు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జియో ఫైనాన్షియల్ తెలిపింది.
ప్రిఫరెన్షియల్ ఇష్యూ, వారంట్ల జారీ ద్వారా బోఫా ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. భాగస్వామ్యం ద్వారా ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లలో బోఫా నైపుణ్యంతో, దేశీ మార్కెట్లో జియో ఫైనాన్షియల్ డిజిటల్ కార్యకలాపాలను మిళితం చేయనున్నట్లు వివరించింది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన జియో క్రెడిట్‌కు 2026 జూన్‌కల్లా రూ. 30,667 కోట్ల నిర్వహణ ఆస్తులున్నాయి.
ఈ వార్తల నేపథ్యంలో జియో ఫైనాన్షియల్ షేరు దాదాపు 1 శాతం పెరిగి రూ.255 వద్ద ముగిసింది.


