ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవో అశోక్ వాస్వానీ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుత మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరే యోచన లేదని ఆయన బోర్డుకు తెలియజేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. 2024 జనవరి 1న కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవోగా బాధ్యత లు చేపట్టిన వాస్వానీ పదవీకాలం ఈ ఏడాది (2026) డిసెంబర్ 31తో ముగియనుంది. వాస్వానీ గతంలో బార్‌క్లేస్, సిటీ గ్రూప్ తదితర అంతర్జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అటు తర్వాత అప్పటి కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో దీపక్ గుప్తా స్థానంలో చేరారు.
రేసులో కాశ్యప్, అనూప్ సాహా: అశోక్ వాస్వానీ వారసుణ్ని ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. వాస్వానీ స్థానంలో బాధ్యతలు తీసుకునేందుకు కీలకమైన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. కోటక్ బ్యాంక్‌లో చిరకాలంగా వివిధ హోదాల్లో పని చేసిన పరితోష్ కాశ్యప్ గతేడాదే హోల్ టైమ్ డైరెక్టరుగా నియమితులయ్యారు. ఆయన హోల్‌సేల్ బ్యాంకింగ్ బిజినెస్‌ని పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పోలిస్తే బ్యాంకులో అనూప్ సాహా కొంత కొత్త వారు. గతంలో బజాజ్ ఫైనాన్స్ సీఈవోగా పని చేశారు. ప్రస్తుతం హోల్ టైమ్ డైరెక్టరుగా కన్జూమర్ బ్యాంకింగ్, మార్కెటింగ్ తదితర విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.


