శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో కాస్పరస్
సామాన్యులకు ఇన్సూరెన్స్‌పై ఫోకస్
ఈ ఏడాది నాలుగు కొత్త ప్లాన్లు
20 శాతం వృద్ధి లక్ష్యం
వ్యాపారంలో తెలుగు రాష్ట్రాలది 25 శాతం వాటా
దేశీయంగా చాలా తక్కువ స్థాయిలోనే ఉన్న బీమా విస్తృతిని పెంచాలంటే ఏజెంట్ల కమీషన్లు, ఇతరత్రా కఠినతర నిబంధనలను కొంత మేర సడలించాల్సిన అవసరం ఉందంటున్నారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో కాస్పరస్ క్రోమౌట్. తక్కువ ప్రీమియంలతో సామాన్యులకు కూడా బీమాను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 20 శాతం వ్యాపార వృద్ధి అంచనా వేస్తున్నామని, తమ వ్యాపారంలో పాతిక శాతం వాటాతో తెలుగు రాష్ట్రాలు కీలకంగా ఉంటున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
మిస్‌సెల్లింగ్‌ని ఆపేందుకు కమీషన్లను కట్టడి చేయడంతో పాటు ఐఆర్‌డీఏఐ పలు చర్యలు తీసుకుంటోంది. పరిశ్రమపై వీటి ప్రభావం ఏంటి?
పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో ఐఆర్‌డీఏఐ తీసుకుంటున్న చర్యలు మంచివే. అయితే, విస్తృత స్థాయిలో బీమాను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం దిశగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. రుణాలు, మ్యుచువల్ ఫండ్స్‌లాంటి ఆర్థిక సాధనాలతో పోలిస్తే జీవిత బీమా పాలసీలను విక్రయించడం కష్టమైన విషయం.
తక్కువ ప్రీమియంలు ఉండే పాలసీలను విక్రయించాలన్నా కస్టమర్లను ఏజంట్లు అనేక సార్లు కలవాల్సి ఉంటుంది. ఇలా తిరిగేందుకు ఖర్చులవుతాయి. ఇలాంటప్పుడు కమీషన్లనేవి వారికి కాస్త ప్రోత్సాహకంగా ఉంటాయి. గతంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించడం వల్ల మాకు కమీషన్ల చెల్లింపులో కొంత వెసులుబటు ఉండేది. కానీ జీఎస్‌టీ సంస్కరణల ఫలితంగా ఆ ప్రయోజనం పోవడంతో అదనపు భారం పడుతోంది. దక్షిణాఫ్రికాలాంటి దేశాల్లో ఏజంట్లు ఫుల్‌టైమ్ చేస్తారు కాబట్టి వారికి కమీషన్ తగ్గినా కాస్త ఫర్వాలేదు. కానీ మన దగ్గర చాల మంది పార్ట్‌టైమ్‌కింద దీన్ని చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో కమీషన్లను గణనీయంగా తగ్గించేస్తే పాలసీలను విక్రయించడానికి ఏజంట్లకు ప్రోత్సాహకం అంటూ ఉండదు. దీంతో బీమా విస్తృతి లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీఎస్‌టీకి సంబంధించి ఇన్‌పుట్ క్రెడిట్ కోల్పోవడం, లేబర్ కోడ్ మార్పులు, కొత్త నిబంధనలు మొదలైన వాటివల్ల ఒత్తిడి ఏర్పడి, పరిశ్రమ వృద్ధికి సవాళ్లుగా మారుతున్నాయి. అంతిమంగా బీమా విస్తృతి లక్ష్యంపైనా ప్రభావం పడుతుంది. 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని సాధించాలంటే ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీటిపై నియంత్రణ సంస్థకు కూడా విజ్ఞప్తులు చేస్తున్నాం.
మెరుగైన రాబడులిచ్చే ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలతో బీమా సేవింగ్స్ ప్రొడక్టులు ఎలా పోటీపడుతున్నాయి?
మ్యుచువల్ ఫండ్స్‌లాంటి పక్కా పెట్టుబడి సాధనాలతో బీమా పథకాలు నేరుగా పోటీపడలేవు. అయితే, కచ్చితమైన రాబడులు, కవరేజీతో పాటు పొదుపుపరంగా క్రమశిక్షణను కోరుకునే వారికి సంప్రదాయ పొదుపు సాధనాలుగా ఇవి ఉపయోగపడతాయి. పూర్తిగా రక్షణ కోసం ఉద్దేశించిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఆదరణ పెరుగుతుండటం పరిశ్రమకు సానుకూలాంశం. మేము గ్యారంటీడ్ సేవింగ్స్ ప్లాన్లను అందిస్తూనే ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్‌కి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం.
కార్యకలాపాల్లో టెక్నాలజీ వినియోగం ఎలా ఉంటోంది?
విశ్వసనీయతను పెంపొందించే విధంగా టెక్నాలజీ వినియోగం ఉండాలనేది మా ఉద్దేశం. జీవిత బీమా అనేది కేవలం సిస్టమ్‌లపై ఆధారపడి పని చేయదు. ప్రత్యక్షంగా కలవడం వల్ల విశ్వసనీయత పెరుగుతుంది. ఇదే సమయంలో సేల్స్ సిబ్బందికి, కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునేందుకు మేము టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మా వ్యాపారంలో ఎక్కువభాగం మా ఆస్ట్రా యాప్ ద్వారా జరుగుతోంది. ఆటోమేటెడ్ విధానంలో పాలసీలను జారీ చేయడాన్ని మరింతగా పెంచుకుంటున్నాం. ఇన్వెస్టిగేషన్ అవసరం లేని చాలా మటుకు క్లెయిమ్‌లను 12 గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నాం.
గతేడాది కంపెనీ వృద్ధి నెమ్మదించింది. ఈసారి పనితీరుపై అంచనాలు ఎలా ఉన్నాయి?
కొన్నాళ్లుగా అధిక స్థాయిలో వృద్ధి నమోదు చేస్తున్నాం. గతేడాది నియంత్రణపరమైన మార్పుల వల్ల కొంత నెమ్మదించినా ఈ ఆర్థిక సంవత్సరంలో 20% వృద్ధిని అంచనా వేస్తున్నాం. నియంత్రణ సంస్థ నిబంధనలకు మేరకు కొన్నింటిలో మార్పుచేర్పులు చేస్తుండగా మరికొన్ని రైడర్లు, కొత్త ప్లాన్ల రూపంలో ఉంటున్నాయి. ఈ ఏడాది మూడు లేదా నాలుగు కొత్త ప్లాన్లు రాబోతున్నాయి.
ఆగస్టులో ఒక ప్లాన్ ప్రవేశపెడుతున్నాం. బిజినెస్‌లో 50 శాతం టర్మ్ పాలసీలు ఉంటాయి. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 20 పాలసీలు, గ్రూప్‌లో 7 పాలసీలు ఉన్నాయి. శ్రీరామ్ బ్రాండ్‌కి మంచి పేరుండటం, విస్తృత స్థాయిలో కార్యకలాపాలు ఉండటం సంస్థకు కలిసొచ్చే అంశం. మేము సాధారణ ఆదాయ వర్గాలకు అనువుగా ఉండేలా అత్యంత తక్కువగా ఐదారు వేల రూపాయల ప్రీమియంలు ఉండే పాలసీలపైనా ఫోకస్ చేస్తున్నాం. తద్వారా బీమా విస్తృతికి తోడ్పడుతున్నాం.
తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం ఎలా ఉంది?
మా మొత్తం న్యూ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాల వాటా 25%గా ఉంటుంది. తెలంగాణలో లీడ్ ఇన్సూరర్‌గా, రెండు రాష్ట్రాల్లో దాదాపు 110 శాఖల ద్వారా లక్షకు పైగా పాలసీలు అందిస్తున్నాం. ప్రైవేట్ రంగ బీమాలో శాఖలపరంగా ఇక్కడ మాది రెండో పెద్ద బీమా సంస్థగా ఉంటోంది. ఇక్కడ కూడా జాతీయ స్థాయి తరహాలోనే 20% వ్యాపార వృద్ధి అంచనా వేస్తున్నాం.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో


