
మార్జిన్లపై ఒత్తిడిని అధిగమిస్తాం
కెనరా బ్యాంక్ ఎండీ సత్యనారాయణ రాజు
న్యూఢిల్లీ: అధికంగా ఉన్న ప్రాధాన్యరంగ రుణాల్లో కొంత వరకు ప్రస్తుత త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) విక్రయించనున్నట్టు కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో కె.సత్యనారాయణ రాజు తెలిపారు. వడ్డీ రేట్లు తగ్గడం కారణంగా మార్జిన్లపై పడే ఒత్తిళ్లను ఈ రూపంలో అధిగమిస్తామన్నారు. జూన్ త్రైమాసికంలో ప్రా ధాన్యరంగ రుణాల విక్రయం రూపంలో రూ.1,248 కోట్ల కమీషన్‌ను కెనరా బ్యాంక్ ఆర్జించడం గమనార్హం. అయినప్పటికీ ప్రాధా న్యరంగ రుణాలు నియంత్రణ పరిమితి 40% కంటే అధికంగా 45.63% స్థాయిలో ఉన్న ట్టు సత్యానారాయణ రాజు చెప్పారు.
మార్కెట్లో ప్రాధాన్య రంగ రుణాలకు డిమాండ్ ఉందంటూ.. దీన్ని అనుకూలంగా మలుచుకుంటామన్నారు. ఆర్‌బీఐ 1% మేర రెపో రేటును తగ్గించడంతో నికర వడ్డీ మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు పేర్కొన్న విధంగా 2.75 శాతాన్ని సాధించడం కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం 3% లోపు కొనసాగితే మరో విడత రేట్ల కోత ఉండొచ్చన్నారు. కనుక ప్రస్తుత త్రైమాసికంపై ఒత్తిళ్లు ఉంటాయంటూ.. క్యూ3, క్యూ4లలో కొంత పురోగతి ఉండొచ్చని అంచనా వేశారు. రెండు సబ్సిడరీల్లో వాటాల విక్రయంతో వెసులుబాటు లభిస్తుందన్నారు. రెండింటిలో ఒక దానిని ప్రస్తుత త్రైమాసికంలో, మరొకటి వచ్చే త్రైమాసికంలో లిస్ట్ కానున్నట్టు చెప్పారు. కెనరా రొబెకో ఏఎంసీ, కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్‌లను ఐపీవోకు తీసుకొచ్చే ప్రణాళికల్లో బ్యాంక్ ఉండడం గమనార్హం.