
దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబమైన ముఖేష్ అంబానీ కుటుంబం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్ని కోట్లున్నా ఆయన కుటుంబంలోని ప్రతిఒక్కరూ అంతే హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. తండ్రి నుంచి వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్న ఆకాశ్ అంబానీ.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్‌గా ఆ సంస్థను విజవంతంగా నడిపిస్తున్నారు.
ప్రతిఒక్కరికీ తమ జీవితంలో ఎవరోఒకరు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇదే క్రమంలో తనకు ప్రేరణ ఎవరని అడిగితే ఆకాశ్ అంబానీ మొదట పేర్కొన్నది కార్పొరేట్ ఐకాన్లు లేదా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ కాదు.. తమ తల్లిదండ్రులేనని గర్వంగా చెబుతారు. ఆమధ్య ముంబై టెక్ వీక్ లో మాట్లాడిన సందర్భంగా గట్టి బంధం ఉన్న కుటుంబంలో పెరగడం తన పని నైతికతను, ఏకాగ్రతను ఎలా తీర్చిదిద్దిందో వివరించారు. నిస్సందేహంగా, మేము పెరిగిన కుటుంబమే అతిపెద్ద ప్రేరణ అని ఆయన అన్నారు. 32 ఏళ్లుగా తామంతా ఒకే గొడుగు కింద జీవిస్తున్నామని, ముఖ్యంగా తన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందని అన్నారు.
ఇప్పటికీ తల్లిదండ్రుల నుంచి రోజువారీ క్రమశిక్షణ, వ్యక్తిగత నిబద్ధతను గమనిస్తుంటానంటారు ఆకాశ్. ముఖేష్ అంబానీ ఇప్పటికీ అర్ధరాత్రి 2 గంటల వరకు తనకు వచ్చే ప్రతి ఈమెయిల్ నూ చదివి క్లియర్ చేస్తారని, ఆ పని ఆయన నలబై ఏళ్లుగా చేస్తున్నారని, ఇక్కడి నుంచే తనకు స్ఫూర్తి వచ్చిందని ఆకాశ్ వివరించారు. ఇక తన తల్లి నీతా అంబానీ నుంచి ఏకాగ్రతతో కూడిన అంకితభావాన్ని ప్రేరణ పొందతానన్నారు.