దేశంలో జియో తర్వాత అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను ఒక్కసారిగా పెంచేసింది. దీంతో పాటు ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పింది. అన్ని పోస్ట్ పెయిడ్ ప్లాన్ లపైనా ఉచిత అంతర్జాతీయ రోమింగ్‌ను ప్రారంభించింది.
ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లు అన్నింటిపైనా రూ .50 చొప్పున పెంచింది. సవరించిన ధరల ప్రకారం.. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇప్పుడు వ్యక్తిగత వినియోగదారుకు రూ .499, ఇద్దరు వ్యక్తులకు రూ .749, ముగ్గురికి రూ .1,049, నలుగురు వ్యక్తులకు రూ .1,249, రూ .1,449 నుంచి ప్రారంభమవుతాయి. అదే కుటుంబంలో ఐదుగురు వ్యక్తులకు అంటే ఐదు నంబర్లకు ప్లాన్ తీసుకుంటే ధర రూ .1,799 నుంచి ఉంటుంది.
ఉచిత అంతర్జాతీయ రోమింగ్
ధరల పెంపుతోపాటు ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలన్నిటికీ ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని ప్రారంభించింది. ఈ ఉచిత ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లో 5 జీబీ డేటా, 60 నిమిషాల కాల్స్, 25 అవుట్‌గోయింగ్ ఎస్ఎంఎస్‌లు, ఉచిత ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్‌లు ఐదురోజుల పాటు లభిస్తాయి.
ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌లపై ఉన్న కస్టమర్లకు, ప్లాన్‌లో భాగమైన ప్రతి కుటుంబ సభ్యుడికీ ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అత్యుత్తమ స్థాయి అనుభవాన్ని అందించడమే తన ప్రాధాన్యమని, ఇందులో భాగంగా వారికి 5G లో ఫాస్ట్ లేన్ టెక్నాలజీ, స్థిరమైన స్పామ్, ఫ్రాడ్ సంరక్షణను అందిస్తున్నట్లు భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అమిత్ త్రిపాఠి పేర్కొన్నారు.
కాగా దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం క్యారియర్ వొడాఫోన్ ఐడియా ఇప్పటికే తమ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం ఉచిత అంతర్జాతీయ రోమింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు సంవత్సరంలో మూడు ట్రిప్పులు ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ను పొందవచ్చు.


