పారిస్‌ ఒలింపిక్స్‌.. భారీగా ట్రావెల్‌ బుకింగ్స్‌! | Airbnb has witnessed a significant surge in bookings across the globe | Sakshi
Sakshi News home page

పారిస్‌ ఒలింపిక్స్‌.. భారీగా ట్రావెల్‌ బుకింగ్స్‌!

Jul 12 2024 3:11 PM | Updated on Jul 12 2024 3:56 PM

Airbnb has witnessed a significant surge in bookings across the globe

పారిస్ ఒలింపిక్స్ 2024 మరికొద్ది వారాల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ట్రావెల్‌ బుకింగ్స్‌ భారీగా పెరినట్లు ఎయిర్‌ బీఎన్‌బీ తెలిపింది. తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 90 శాతం వినియోగదారులు ఒలింపిక్స్‌ జరిగే ప్రదేశాల చుట్టూ ఉ‍న్న హోటల్స్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నట్లు పేర్కొంది.

జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఈసారి పారిస్‌ ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, అథ్లెట్లు, ఇతరులు ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే చాలా మంది ఒలింపిక్స్‌ జరిగే క్రీడా ప్రాంగణాల పరిసరాల్లోని హోటల్స్‌ను బుక్‌ చేసుకున్నారు. ఈమేరకు ఆతిథ్య రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ ఆన్‌లైన్‌ హోటల్‌ బుకింగ్‌ ప్లాట్‌పామ్‌ ఎయిర్‌ బీఎన్‌బీ ప్రకటన విడుదల చేసింది. ఒలింపిక్స్‌ జరిగే ఆక్వాటిక్స్‌ సెంటర్‌, బెర్సీ అరెనా, బార్‌డాక్స్‌ స్టేడియం, చాంప్‌ డే మార్స్‌ అరెనా, చాటూ డి వెర్సల్లీస్‌, చాట్రాక్స్‌ షూటింగ్‌ సెంటర్‌, ఈఫిల్‌ టవర్‌ స్టేడియం..వంటి క్రీడా ప్రాంగాణాల పరిసరాల్లో హోటల్స్‌ పూర్తిగా బుక్‌ అయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారుల్లో దాదాపు 90 శాతం మంది ఈ ఒలింపిక్స్‌ జరిగే ప్రాంతాల్లోని హోటల్స్‌ను సెర్చ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. భారత్‌, చైనా, హాంకాంగ్, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఈసారి అత్యధిక పెరుగుదల కనిపిస్తుందని చెప్పింది. భారతీయ ప్రయాణికులు పారిస్‌తోపాటు సమీపంలోని నైస్, ఆబర్‌విల్లియర్స్, కొలంబెస్, సెయింట్-ఓవెన్-సుర్-సీన్ వంటి ఇతర ప్రదేశాలను అన్వేషిస్తున్నారని తెలిపింది.

ఈ సందర్భంగా ఎయిర్‌ బీఎన్‌బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా 160 కంటే ఎక్కువ దేశాల నుంచి అభిమానులు, క్రీడాకారులు, అథ్లెట్లు ఒలింపిక్స్‌కు హాజరుకానున్నారు. భారతీయులు ఒలింపిక్స్ ఈవెంట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నారు. గతంలో కంటే 30 శాతం భారత ప్రయాణికుల సంఖ్య​ పెరుగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 నాటికి హోటల్స్‌లో బుక్ అయిన ‘స్టేయింగ్‌ టైం(రాత్రి, పగలు బుక్‌ చేసుకునే సమయం)’ రెండేళ్ల క్రితం వ్యవధితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది’ అన్నారు.

ఇదీ చదవండి: ఖతార్‌లో యూపీఐ సేవలు..!

పారిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల పరిసర ప్రాంతాల్లోని దాదాపు రూ.8,300 కోట్లు వ్యాపారం సాగుతుందని అంచనా. దీనివల్ల దాదాపు 7,300 మందికి ఉపాధి లభిస్తుందని సమాచారం. ఇదిలాఉండగా, పారిస్‌లో ఒలింపిక్స్‌ నిర్వహణ సరైన నిర్ణయం కాదని గతంలో 44 శాతం స్థానికులు అభిప్రాయపడ్డారు. వేదికలు, క్రీడా గ్రామాల ఏర్పాటులో భాగంగా వేలాది మంది నిర్వాసితులను సమీపంలోని భవనాల నుంచి ఖాళీ చేయించడంపైనా విమర్శలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement