కృత్రిమ మేధస్సు (AI) విప్లవం కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా కేవలం పర్యవేక్షణకే పరిమితమయ్యే "ప్యూర్ పీపుల్ మేనేజర్ల" మనుగడ ఇకపై కష్టమేనని ఎయిర్‌బీఎన్బీబి (Airbnb) సీఈఓ బ్రియాన్ చెస్కీ హెచ్చరించారు. పనిలో ప్రత్యక్షంగా భాగస్వాములు కాకుండా, కేవలం సిబ్బందిని మేనేజ్ చేసే పాత పద్ధతులకు కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.
పని చేయని వారికి చోటు లేదు!
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన చెస్కీ, ఏఐ యుగంలో నెట్టుకురావాలంటే మేనేజర్లు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఇకపై మేనేజర్లు కేవలం మీటింగ్‌లు, పర్ఫార్మెన్స్ రివ్యూలకే పరిమితం కాకూడదు. ప్రాజెక్టుల లోతుపాతులను అర్థం చేసుకుంటూ టీమ్‌తో కలిసి పని చేయాలి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అప్‌డేట్ అవ్వని వారు, ఏఐ వినియోగాన్ని వ్యతిరేకించే వారు కెరీర్ రేసులో వెనుకబడిపోతారని ఆయన స్పష్టం చేశారు.
ఎయిర్‌బీఎన్‌బీలో 60% కోడింగ్ ‘ఏఐ’తోనే..
ఎయిర్‌బీఎన్‌బీ ఇప్పటికే ఏఐ వినియోగంలో ముందుంది. కంపెనీలో దాదాపు 60% కోడింగ్ ఇప్పుడు ఏఐ ద్వారానే జరుగుతోందని, దీనివల్ల ఉత్పత్తులను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడమే కాకుండా, తక్కువ మందితో సమర్థవంతంగా పనిచేయడం సాధ్యమవుతోందని కంపెనీ వెల్లడించింది.
తగ్గుతున్న ‘మేనేజ్మెంట్’ పొరలు
ఒక్క ఎయిర్‌బీఎన్‌బీ మాత్రమే కాదు, అనేక దిగ్గజ టెక్ సంస్థలు ఇప్పుడు "ఫ్లాటర్ స్ట్రక్చర్" (తక్కువ మేనేజ్మెంట్ స్థాయిలు) వైపు మొగ్గు చూపుతున్నాయి.మెటా ఇప్పటికే మేనేజ్మెంట్ పొరలను తొలగించి నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేసింది. బ్లాక్ సీఈఓ జాక్ డోర్సే కూడా శాశ్వత మిడిల్ మేనేజ్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాయిన్‌బేస్ సీఈఓ బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ సైతం "ప్యూర్ మేనేజర్" పాత్రలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
వస్తున్నది ‘ప్లేయర్-కోచ్’ల కాలం
నివేదికలు, షెడ్యూలింగ్, పనితీరును ట్రాక్ చేయడం వంటి పనులను ఏఐ సులభంగా చేసేస్తోంది. కాబట్టి, కేవలం ఆర్డర్లు వేసే మేనేజర్ల కంటే, సాంకేతిక పరిజ్ఞానం ఉండి ప్రాజెక్టులో నేరుగా పాల్గొనే "ప్లేయర్-కోచ్" తరహా నాయకులకే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జూనియర్ల విషయంలో జాగ్రత్త!
అయితే, ఏఐ మోజులో పడి కొత్త గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్‌ల నియామకాలను ఆపవద్దని చెస్కీ హెచ్చరించారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను పూర్తిగా తొలగిస్తే, భవిష్యత్తులో కంపెనీలను నడిపించే నాయకులు తయారుకారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని ఉత్పాదకత పెంచుకోవడానికి వాడుకోవాలి తప్ప, నైపుణ్యం కలిగిన మానవ వనరుల పైప్‌లైన్‌ను దెబ్బతీసేలా ఉండకూడదని ఆయన సూచించారు.


