ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సైఅంటోంది. అహ్మదాబాద్ లో 2036లో ఈ పోటీలకు ఆతిథ్యం వహించేందుకు భారత్ అధికారికంగా బరిలోకి దిగింది. ఖతార్ (దోహాలో), చిలీ (శాంటియాగోలో), తుర్కియే (ఇస్తాంబుల్‌లో) ఈ పోటీలు నిర్వహిస్తామంటూ మనకు ప్రస్తుతానికి పోటీగా నిలుస్తున్నాయి. దక్షిణాఫ్రికా కూడా ముందుకొచ్చిందికానీ, ఏ నగరంలో నిర్వహించదలచుకున్నదీ పేర్కొన లేదు.
బెర్లిన్, కలోన్, హ్యాంబర్గ్, మ్యూనిక్‌లలో ఎక్కడో ఒకచోట నిర్వహించాలని జర్మనీ యోచిస్తోంది. సెప్టెంబర్‌లో తుది నిర్ణ యాన్ని ప్రకటించవచ్చు. అయితే, బెర్లిన్, మ్యూనిక్ నగరాలు చేదు జ్ఞాపకాలనే రేపుతాయి. జర్మనీ 2036 అవకాశాన్ని దక్కించుకోలేక పోతే, 2040 లేదా 2044లలో నిర్వహించేందుకు ప్రయత్నించవచ్చు.
అపఖ్యాతిని మూటగట్టుకున్న జర్మనీ
జర్మనీ నేడున్నట్లుగా సమైక్యంగా ఉన్నప్పుడు 1936లో బెర్లిన్‌లో ఒకసారి ఒలింపిక్స్ నిర్వహించింది. ఆ తర్వాత, 1972లో ఆనాటి పశ్చిమ జర్మనీలోని మ్యూనిక్‌లోనూ నిర్వహించారు. 1936లో ఎక్కడ పోటీలు నిర్వహించాలో 1931లో నిర్ణయించారు. ఆ మరుసటి ఏడాది (1932లో) అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చారు. ఆయన ఆ క్రీడోత్సవాలను ప్రాపగాండా వ్యవహారంగా మార్చేశారు. తమను ఆధిపత్య (ఆర్య) జాతికి చెందినవారుగా చాటుకోవాలని హిట్లర్ చేసిన ప్రయత్నంతో, అవి ‘నాజీ ఒలింపిక్స్’గా అపకీర్తిని మూటగట్టుకున్నాయి.
దాని ప్రతీకార జ్వాలను మ్యూనిక్ 1972లో చవిచూసింది. పాలస్తీనా విమోచన సంస్థకు చెందినవారు ఒలింపిక్ గ్రామంలోకి అథ్లెట్ల ముసుగులో అడుగుపెట్టి, ఇజ్రాయెల్ క్రీడాకారుల బసలోకి ప్రవేశించి కొందరిని బందీలుగా పట్టుకుని, ఆ తర్వాత వారిని హత మార్చారు. మొత్తం 11 మంది క్రీడాకారులను బలి తీసుకున్న ఆ ఉదంతం క్రీడా చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది.
జర్మన్లకు వారి నాజీ గతం ఇబ్బందికరంగానే ఉంది. బెర్లిన్‌ను 2036 క్రీడలకు ఎంచుకుంటే, పాత గాయాలను రేపినట్లు అవుతుందేమోనని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్–వాల్టర్ స్టెయిన్మయర్ ఆందోళన వ్యక్తపరచారు. అపఖ్యాతి పాలైన ‘నాజీ ఒలింపిక్స్’కు సరిగ్గా ఆ ఏడాదిలోనే నూరేళ్ళు నిండుతాయి. హిట్లర్‌కు ప్రీతిపాత్రమైన జాతి సిద్ధాంతం బెర్లిన్‌లో తుత్తు నియలైంది. ఆఫ్రో–అమెరికన్ జెస్సీ ఓవెన్స్ ఆ పోటీల్లో 100 మీటర్ల, 200 మీటర్ల , 4గీ100 మీటర్ల రిలే, లాంగ్ జంప్ విభాగాల్లో స్వర్ణాలు సాధించి శాశ్వత కీర్తిని గడించారు.
1936 ఒలింపిక్స్‌లో ఇండియా
బ్రిటన్ పతాకం కింద భారత బృందం పాల్గొన్న చివరి ఒలింపిక్స్‌గా కూడా 1936 ఒలింపిక్స్ లెక్కకు వస్తాయి. ఆ బృందంలో ధ్రువతార ధ్యాన్‌చంద్ నేతృత్వంలోని హాకీ జట్టు, నలుగురు రన్నర్లు, బర్మా (నేటి మయన్మార్) నుంచి వచ్చిన ఒక వెయిట్ లిఫ్టర్ కూడా ఉన్నారు. అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో బర్మా భాగంగాఉండేది. బెర్లిన్ (1936) ఒలింపిక్స్‌లో భారత్ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా, నేటి సోషల్ మీడియాయుగంలో కల్పనల నుంచి వాస్తవాలను వేరు చేసి చూడటం కష్టం.
వీఐపీ బాక్స్‌లో కూర్చున్న హిట్లర్ వంక చూస్తూ కుడివైపు తిరిగి శాల్యూట్ చేయడానికి అమెరికాతోపాటు తిరస్కరించిన ఏకైకబృందం భారతదేశానిదేనని ఒక కథ ప్రచారంలో ఉంది. దాన్ని మన ధైర్యానికి, లొంగనితత్వానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదు. కవాతులో పాల్గొన్న 49 బృందాలలో నాజీ వందనం సమర్పించింది ఆతిథేయ దేశమైన జర్మనీ మాత్రమే.
జర్మన్ ఒలింపిక్ చరిత్రకారుల పితామహుడు, ముఖ్యంగా, 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌కు సంబంధించిన నిపుణుడు ఫోల్కా క్లట్జ్ ప్రకారం, నాజీ శాల్యూట్‌కి, ఒలింపిక్ శాల్యూట్‌కి మధ్యనున్న సారూప్యత కారణంగా రకరకాల అపోహలు తలె త్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ శాల్యూట్‌కి 1946లో స్వస్తి పలికింది.
సాటిలేని భారత హాకీ జట్టు 1928, 1932 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకుని, 1936లో హ్యాట్రిక్ సాధించే ప్రయత్నంచేసింది. దానికి తగ్గట్లుగానే ఫైనల్‌లో జర్మనీతో తలపడి 8–1 గోల్స్ తేడాతో దాన్ని ఓడించింది. ఆగస్టు 14న జరగవలసిన ఆ పోటీ భారీ వర్షం వల్ల వాయిదా పడి ఆ మరుసటి రోజైన ఆగస్టు 15న ఉదయం 11 గంటలకు జరిగింది. ఆ తర్వాత, ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్–జర్మనీల మధ్య ఫైనల్ మ్యాచ్ చూసేందుకు హిట్లర్ వచ్చారనీ, ధ్యాన్‌చంద్ హాకీ స్టిక్ ఒడుపులు చూసి, ఆయన కళ్లు చెదిరాయనీ చెప్పే కథనంలో కూడా వాస్తవం లేదని క్లట్జ్ అంటారు.
ఒలింపిక్స్‌లో క్రీడా జర్నలిస్ట్!
ఈ సందర్భంగా చార్లెస్ సెబాస్టియన్ అరుళ్ స్వామి గురించి కూడా చెప్పుకోవాలి. మన స్వామి ఎంత ఘటికుడో తెలుసా? ‘హిట్లర్ అంతటివాడిని టీ తాగేందుకు వేచి ఉండేటట్లు చేశాడు’ అని క్రీడా జర్నలిస్టులు ఆయనను ఆటపట్టిస్తూ ఉండేవారు. స్పోర్ట్స్ జర్నలిజంలో ఆయనే నాకు గురువు. ఇంతకూ ఏం జరిగిందంటే, ఆ ఒలింపిక్స్ మారథాన్‌లో స్వామి పాల్గొన్నారు. ఆయన ఆపసోపాలు పడుతూ చివరలో ఎప్పటికో వచ్చారనీ, ఫలితంగా ముగింపు వేడు కలో జాప్యం జరిగిందనీ జర్నలిస్టులు ఆ విధంగా ఎద్దేవా చేసేవారు.
వాస్తవం ఏమిటంటే, మారథాన్ పూర్తి చేసిన 42 మందిలో స్వామి 37వ వ్యక్తిగా నిలిచారు. ఆ రోజు 14 మంది దాన్ని పూర్తి చేయలేకపోయారు. కనుక, స్వామి దృఢత్వాన్ని మెచ్చుకోవాల్సిందే. పైగా, జ్వరంతో కోలుకుని మరీ ఆ పోటీలో పాల్గొన్నారు. సుదీర్ఘ నౌకాయానం వల్ల పారాటైఫాయిడ్ బారినపడ్డారు. ఫలితంగా, 3 వారాలు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో, మార థాన్‌ను చివరకు మార్చారుకానీ, అప్పట్లో అది ముందే ఉండేది.
స్వామి తన 83వ ఏట, కోయంబత్తూరులో 1997లో కన్ను మూశారు. భారతదేశపు క్రీడా జర్నలిజం వైతాళికు లలో ఆయనొ కరు. స్వామి గట్టి పోటీనివ్వగల షూటర్ కూడా. ఫుట్‌బాల్ కోచ్‌గా, రిఫరీగా కూడా వ్యవహరించారు. ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్న ఏకైక క్రియాశీల జర్నలిస్ట్ ఆయనొక్కరేనని చెబుతారు.
-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
-గులు ఇజికియల్


