నైట్‌రైడర్స్‌ ‘హోం’లో ఒలింపిక్స్‌ | Cricket main venue in Los Angeles finalized | Sakshi
Sakshi News home page

నైట్‌రైడర్స్‌ ‘హోం’లో ఒలింపిక్స్‌

Apr 24 2026 2:45 AM | Updated on Apr 24 2026 2:45 AM

Cricket main venue in Los Angeles finalized

లాస్‌ ఏంజెలిస్‌లో క్రికెట్‌ ప్రధాన వేదిక ఖరారు   

లాస్‌ ఏంజెలిస్‌: ఒలింపిక్స్‌లో 128 సంవత్సరాల తర్వాత క్రికెట్‌ పునరాగమనం చేస్తుండగా ఇప్పుడు ఈ మెగా ఈవెంట్‌లో మ్యాచ్‌లు నిర్వహించే ప్రధాన వేదిక ఖరారైంది. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ కూడా భాగంగా ఉంది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ‘పొమోనా’లో కొత్తగా నిర్మిస్తున్న మైదానాన్ని క్రికెట్‌ ప్రధాన వేదికగా నిర్ణయించారు. ఈ మైదానం ఐపీఎల్‌ టీమ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యానికి చెందినది కావడం విశేషం. అమెరికాలో 2023 సీజన్‌ నుంచి నిర్వహిస్తున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)లో లాస్‌ ఏంజెలిస్‌ నైట్‌రైడర్స్‌ జట్టు కూడా ఉంది. 

ఈ టోర్నీలో తమ ‘హోం’ గ్రౌండ్‌ కోసం నైట్‌రైడర్స్‌ ఈ స్టేడియాన్ని నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం బుధవారం జరిగింది. వచ్చే రెండేళ్లలో మైదానం నిర్మాణం పూర్తి చేసుకొని ఒలింపిక్స్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధమవుతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో క్రికెట్‌ పురోగతి కొత్త మైలురాయిగా నిలుస్తుందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ జై షా అన్నారు. 

‘అంతర్జాతీయ క్రీడగా క్రికెట్‌ విస్తరించే క్రమంలో ఇది మరో కొత్త మలుపు. ఒలింపిక్స్‌లో పాల్గొని ఆట స్థాయిని పెంచడమే మా లక్ష్యం. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పునరాగమనానికి సంబంధించి ఈ స్టేడియం నిర్మాణం కొత్త మైలురాయి. ఒలింపిక్స్‌లో ఈ మైదానం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మా విశ్వాసం’ అని ఆయన చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సంజోగ్‌ గుప్తా, నైట్‌రైడర్స్‌ సీఈఓ వెంకీ మైసూర్, పొమోనా నగర మేయర్‌ టిమ్‌ సాండోవల్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement