అంతర్జాతీయ ప్రయాణికులకు టాటా కొత్త సిమ్‌ | Air India Tata Comms EasyRoam Launch International Roaming Details | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ప్రయాణికులకు టాటా కొత్త సిమ్‌

Oct 8 2026 1:49 PM | Updated on Oct 8 2026 2:12 PM

Air India Tata Comms EasyRoam Launch International Roaming Details

ఎయిర్‌ ఇండియా, టాటా భాగస్వామ్యంలో ‘ఈజీరోమ్‌’ ట్రావెల్‌ సిమ్‌

విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు డిజిటల్‌ కనెక్టివిటీని మరింత సులభతరం చేస్తూ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా, టెలికాం దిగ్గజం టాటా కమ్యూనికేషన్స్‌ ఉమ్మడిగా ‘ఈజీరోమ్‌’ (EasyRoam) పేరిట కొత్త ఇంటర్నేషనల్ ట్రావెల్‌ సిమ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. విదేశీ ప్రయాణాల్లో ప్లాన్లు ఎంచుకోవడం, రోమింగ్‌ చార్జీల భారం తగ్గించుకోవడం వంటి సమస్యలకు ఈ భాగస్వామ్యం సమర్థవంతమైన పరిష్కారాన్ని చూపుతోంది.

ప్రారంభ ధర రూ.241

విదేశీ రోమింగ్ ప్యాక్‌ల ప్రారంభ ధర పన్నులు మినహాయించి రూ.241గా నిర్ణయించారు. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా కేవలం డేటా లేదా డేటా + వాయిస్‌ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. విమాన టికెట్ బుకింగ్ సమయంలోనే ఎయిర్ ఇండియా ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఫిజికల్ సిమ్ లేదా ఈ-సిమ్‌ను ప్రయాణికులు పొందవచ్చు. ప్రారంభ ఆఫర్‌ కింద ఈ సిమ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. తొలి విడతగా ఉత్తర అమెరికా, యూరప్‌ (యూకే సహా), ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ పరిధిలోని 30 దేశాల్లో ఈజీరోమ్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే దీనిని ప్రపంచ వ్యాప్తంగా 190కి పైగా దేశాలకు విస్తరించనున్నారు.

డేటా ప్లాన్ కొనుగోలు చేసే ప్రయాణికులకు 1జీబీ వరకు ఉచిత కాంప్లిమెంటరీ డేటా లభిస్తుంది (మాల్దీవులు, మారిషస్‌ మినహా). నామమాత్రపు రుసుముతో ప్రయాణికులు తమ రోమింగ్‌ నంబర్‌ను ఏడాది పాటు యాక్టివ్‌గా ఉంచుకునే వెసులుబాటును కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా 600కి పైగా మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లతో టాటా కమ్యూనికేషన్స్‌కు ఉన్న మౌలిక సదుపాయాల భాగస్వామ్యం ఈజీరోమ్‌కు ప్రధాన బలమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎయిర్ ఇండియా చేపట్టిన ‘విహాన్‌.ఏఐ’ డిజిటల్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూపుదిద్దుకున్న ఈ సర్వీసు త్వరలోనే ఎయిర్‌ ఇండియా మొబైల్ యాప్‌లోనూ నేరుగా అందుబాటులోకి రానుంది.

ఇదీ చదవండి: తులం బంగారం కొంటే ఎంత ఖర్చు? నేటి గోల్డ్‌ రేట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement